అవమానించడం ఎక్కువైపోయింది: హేమమాలిని 

బాలీవుడ్‌ ప్రముఖులంతా కలిసి రెండు టీవీ ఛానెళ్లకు వ్యతిరేకంగా దావా వేసిన సంగతి తెలిసిందే. సదరు ఛానెళ్లు బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను తప్పుగా చిత్రీకరించి, పరువుకు భంగం కలిగించాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా దీనిపై ప్రముఖ నటి, భారత జనతా పార్టీ ఎంపీ హేమ మాలిని స్పందించారు.......

Published : 18 Oct 2020 22:45 IST

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖులంతా కలిసి రెండు టీవీ ఛానెళ్లకు వ్యతిరేకంగా దావా వేసిన సంగతి తెలిసిందే. సదరు ఛానెళ్లు బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను తప్పుగా చిత్రీకరించి, పరువుకు భంగం కలిగించాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా దీనిపై ప్రముఖ నటి, భాజపా ఎంపీ హేమమాలిని స్పందించారు. బాలీవుడ్‌ ప్రముఖులు దావా వేయడం పట్ల మద్దతు తెలిపారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎవరూ తనతో అగౌరవంగా ప్రవర్తించలేదని పేర్కొన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌ను అవమానిస్తూ అతిగా మాట్లాడుతున్నారు. మేమంతా మంచి వాళ్లమని, తప్పులు చేసే వారు ఇక్కడ లేరని నేను చెప్పడం లేదు. కానీ మా అందర్నీ డ్రగ్స్‌ తీసుకునేవారిలా చూస్తూ.. మమ్మల్ని భరించలేని విధంగా చెడుగా సమాజానికి చూపడం సరికాదు. గత 40 ఏళ్లుగా నేను బాలీవుడ్‌లో ఉన్నా. నేను ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. నన్ను కూడా ఎవరూ అలా చూడలేదు. ఎంతో గౌరవించారు’ అని ఆమె చెప్పారు.

దీనిపై ఇటీవల ప్రముఖ నటి షబానా అజ్మీ కూడా స్పందించారు. అన్నీ సంఘాలు, నిర్మాణ సంస్థలు కలిసి వేసిన దావా సరైనదేనని, హిందీ చిత్ర పరిశ్రమలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం, డ్రగ్స్‌ వ్యవహారం నేపథ్యంలో బాలీవుడ్‌పై ఆరోపణలు అధికమయ్యాయి. కొందరు హద్దులు మీరి కథనాలు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో 34 మంది బాలీవుడ్ నిర్మాతలు, 4 బాలీవుడ్‌ అసోసియేషన్లు కలిసి రెండు టీవీ ఛానెళ్లపై దావా వేశాయి. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్మాతలతోపాటు షారుక్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగణ్‌ తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని