Published : 06 Oct 2020 12:56 IST

కాజల్‌-గౌతమ్‌ పెళ్లి ముహూర్తం ఖరారు

అధికారికంగా ప్రకటించిన ముద్దుగుమ్మ

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ‘చందమామ’ కాజల్‌ పెళ్లి కుమార్తె కాబోతున్నారు. మంగళవారం తీపి కబురు వినిపించారు. అక్టోబరు 30న ముంబయిలో తన వివాహ వేడుక జరగబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ‘గౌతమ్‌ కిచ్లును అక్టోబరు 30న వివాహం చేసుకోబోతున్నానని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముంబయిలో ఆత్మీయుల సమక్షంలో మా పెళ్లి వేడుక జరగబోతోంది. జీవితంలోని ఈ కొత్త ఆరంభం కోసం మేం ఎంతో థ్రిల్లింగ్‌గా ఎదురుచూస్తున్నాం. మీ అందరూ కూడా ఈ ఆనందంలో భాగస్వామ్యం అవుతారని ఆశిస్తున్నా’.

‘ఇన్నేళ్లుగా మీరంతా నాపై కురిపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఈ కొత్త ప్రయాణంలో మేం మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం. పెళ్లి తర్వాత కూడా నేను నాకు ఎంతో ఇష్టమైన నటనను కొనసాగిస్తాను. నా ప్రేక్షకులకు వినోదం అందిస్తాను. మరోసారి మీ అమితమైన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని కాజల్‌ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ను కేవలం 40 నిమిషాల్లో 2 లక్షల మందికిపైగా లైక్‌ చేశారు. సినీ ప్రముఖులు రాశీ ఖన్నా, ప్రగ్యా జైశ్వాల్‌, అనసూయ, మెహరీన్‌, నటాషా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మరోపక్క కాజల్‌-గౌతమ్‌ వివిధ సందర్భాల్లో కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో కాజల్‌ నిశ్చితార్థం జరిగిందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. త్వరలో వీరి పెళ్లి వేడుకను ముంబయిలో నిర్వహించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ వార్తల్ని కాజల్‌ తన పోస్ట్‌తో నిజం చేశారు. గౌతమ్‌ కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత టఫ్ట్స్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థను స్థాపించి నడుపుతున్నారు.

కాజల్‌ గత ఏడాది ‘సీత’, ‘రణరంగం’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ‘ఆచార్య’, ‘మోసగాళ్లు’, ‘భారతీయుడు 2’, ‘ముంబయి సగ’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె టైటిల్‌ రోల్‌ పోషించిన ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ విడుదలకు సిద్ధమౌతోంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని