కంగన చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ప్రభుత్వం ఆమెకు మరో షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది.

Published : 12 Sep 2020 12:31 IST

ముంబయి: అధికార శివసేన పార్టీతో ఢీకొంటున్న బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఆమె కార్యాలయం కూల్చివేత అనంతరం.. ప్రభుత్వం ఆమెకు మరో షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. అమెను మాదకద్రవ్యాల కేసులో విచారించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు నటిపై డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు ప్రారంభించినట్టు ముంబయి పోలీసులు వివరించారు. కంగనకు మాదక ద్రవ్యాలతో సంబంధముందంటూ గతంలో ఓ నటుడు చేసిన ఆరోపణల ఆధారంగా.. కంగనపై విచారణకు హోంశాఖ లిఖిత పూర్వక ఆదేశాలు జారీచేసింది.

ప్రముఖ టీవీ, సినిమా నటుడు శేఖర్‌ సుమన్‌ కుమారుడు అధ్యాయన్‌ సుమన్‌.. ఒకప్పుడు కంగనకు సన్నిహితుడు. గతంలో కంగన తనను కూడా డ్రగ్స్‌ తీసుకోవాల్సిందిగా కోరినట్టు ఆరోపించారు. అయితే, ఇప్పుడు తన పేరును వివాదాల్లోకి లాగవద్దంటూ అధ్యాయన్‌ సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశారు. 2016లో మీడియా తనను ఇబ్బందులకు గురిచేసిందని.. అనేక కష్టనష్టాలకు ఓర్చి ఇప్పుడిప్పుడే తన కెరీర్‌ను నిర్మించుకుంటున్నానని ఆయన తెలిపారు. ఇక ఈ విషయంపై తాను స్పందించేందుకు ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

సుశాంత్‌ అనుమానాస్పద మృతి నేపథ్యంలో.. ముంబయి పాక్‌ ఆక్రమిత కశ్మీరులా అనిపిస్తోందన్న కంగనా రనౌత్‌ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అనేక నాటకీయ పరిణామాల అనంతరం.. బుధవారం కంగన కార్యాలయం కూల్చివేత ఘటన చోటుచేసుకుంది. ఇందుకు మండిపడ్డ కంగన, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేని ఏకవచనంతో సంబోధిస్తూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియో సంచలనం సృష్టించింది. ‘‘ఉద్ధవ్‌ ఠాక్రే.. నువ్వు ఏమనుకుంటున్నావు? మూవీ మాఫియాతో కలిసి నా ఇల్లు నాశనం చేసి ప్రతీకారం తీర్చుకుంటున్నాను అనుకుంటున్నావా? ఈ రోజు నా ఇల్లు నాశనమైంది.. రేపు నీ గర్వం నాశనమౌతుంది..’’ అంటూ కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం కూల్చివేత.. ఇప్పుడు తాజా డ్రగ్స్‌ కేసు... ఇవన్నీ అధికార పార్టీ కక్షసాధింపు చర్యలే అని కంగన విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని