కంగనకు ప్రాణాపాయం.. ‘వై ప్లస్‌’ సెక్యూరిటీ!

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్‌’ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం నేపథ్యంలో ఇటీవల కంగన చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ వాడకం గురించి మాట్లాడారు. ఈ మేరకు ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున భద్రత కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు...

Updated : 07 Sep 2020 13:50 IST

ముంబయి వస్తోన్న నేపథ్యంలో..

ముంబయి: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్‌’ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం నేపథ్యంలో ఇటీవల కంగన చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ వాడకంపై మాట్లాడారు. ఈ మేరకు ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున భద్రత కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ‘వై ప్లస్‌’ కేటగిరీ సెక్యూరిటీలో 11 మంది సీఆర్‌పీఎఫ్‌ కమాండోలు ఆమెకు భద్రతగా ఉండబోతున్నారు. ‘కంగన హిమాచల్‌ కుమార్తె. ఆమెకు ప్రాణాపాయం ఉన్నందున కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత ఏర్పాటు చేసింది’ అని ఈ సందర్భంగా హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ అన్నారు.

మరోపక్క గత కొన్ని రోజులుగా కంగన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసు గురించి మాట్లాడుతూ.. బాలీవుడ్‌ మూవీ మాఫియా కంటే ముంబయి పోలీసులంటేనే ఎక్కువ భయంగా ఉందని విమర్శించారు. దీంతో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. కంగన ముంబయి రాకుండా తన స్వస్థలంలోనే ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఇది తనను బెదిరించడమేనని, ముంబయి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లా అనిపిస్తోందని కంగన విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ ముఖ్‌ స్పందిస్తూ.. ముంబయిలో నివసించడానికి కంగనకు ఎటువంటి హక్కు లేదన్నారు. దీనికి నటి సోదరి రంగోలీ స్పందిస్తూ.. సెప్టెంబరు 9న ముంబయిలోని తమ ఇంటికి వస్తున్నామని, ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండని సవాలు చేశారు.

అమిత్‌షాకు రుణపడి ఉంటా: కంగన

తనకు ‘వై ప్లస్‌’ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు కంగన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. ‘జాతీయ వాదుల స్వరాన్ని ఎటువంటి శక్తులు అణచివేయలేవు అనడానికి ఇది రుజువు. ప్రస్తుత పరిస్థితుల్ని పరిగణనలో ఉంచుకుని.. నన్ను ముంబయికి వెళ్లమని చెప్పిన అమిత్‌ షాకు రుణపడి ఉంటాను. ఆయన ఈ దేశపు కుమార్తె మాటల్ని గౌరవించారు. జై హింద్’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని