ముంబయిపై కంగన వివాదాస్పద వ్యాఖ్యలు

ఎవరికైనా ధైర్యముంటే నన్ను ఆపండి..’’అని ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ ప్రకటించటం కొసమెరుపు.

Published : 05 Sep 2020 02:15 IST

సోనూ సూద్‌తో సహా స్పందించిన బాలీవుడ్‌..

ఇంటర్నెట్‌ డెస్క్: వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. కరోనా వైరస్‌ నేపథ్యంలో కంగన ప్రస్తుతం మనాలిలోని తన సొంత ఇంట్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల సుశాంత్‌ సింగ్‌ మృతి కేసు గురించి మాట్లాడుతూ.. మూవీ మాఫియా కంటే ముంబయి పోలీసులంటేనే తనకు ఎక్కువ భయంగా ఉందని విమర్శించారు. దీనితో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, ఆమెను ముంబయి తిరిగి రాకుండా అక్కడే ఉండిపోవాలని  సూచించారు. ఇందుకు స్పందించిన కంగన ఇది తనను బహిరంగంగా బెదిరించడమేనని.. ముంబయి పాక్‌ ఆక్రమిత కశ్మీరులా (పీఓకే) అనిపిస్తోందని ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ తారలు ఈ విధంగా స్పందించారు...

సోనూ సూద్‌

‘‘ఈ నగరం తలరాతలను మారుస్తుంది. దీనికి నమస్కారం చేస్తే, పురస్కారమే లభిస్తుంది.’’

రితేశ్‌ దేశ్‌ముఖ్‌
‘‘ముంబయి భారత దేశంలో ఉంది.’’

ఊర్మిళా మంతోడ్కర్‌

‘‘శివాజీ మహారాజు నేల మహారాష్ట్ర. లక్షలాది మందికి తిండి పెట్టింది. వారికి పేరు, ప్రతిష్ఠలనిచ్చింది. కృతజ్ఞత లేనివారే దీనిని పీఓకే తో పోల్చగలరు. షాక్‌కు, అసహనానికి గురయ్యాను. అయిందేదో అయింది.. ముంబయి మనది.’’

దియా మీర్జా

‘‘ముంబయి నా ప్రాణం. 19 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చిన నేను.. 20 ఏళ్లకు పైగా ఇక్కడే ఉన్నాను, ఇక్కడే పనిచేశాను. ఈ నగరం నన్ను చేతులు చాచి మరీ దగ్గరకు తీసుకుంది. నాకు రక్షణ నిచ్చింది. ఇది విశ్వనగరం, అందరినీ కలుపుకొనిపోతుంది, విభిన్నమైనది, అందమైనది.’’

స్వరా భాస్కర్‌

‘‘ఓ బయటి వ్యక్తిగా, స్వతంత్ర్య భావాలున్న ఉద్యోగిగా ముంబయిలో గత దశాబ్దం నుంచి ఉంటున్నాను. నివసించటానికి, పనిచేసుకునేందుకు అనువైన, సురక్షితమైన నగరాల్లో ముంబయి ఒకటి. మన ముంబయిని సురక్షితంగా ఉంచేందుకు మీ నిరంతర కృషి, సేవలకు థాంక్యూ ముంబయి పోలీస్‌.

రేణుకా సహానే

‘‘ప్రియమైన కంగనా! ముంబయి బాలీవుడ్‌ స్టార్‌ కావాలనే నీ ఆశను నెరవేర్చిన నగరం. ఈ అద్భుతమైన నగరం పట్ల కాస్తయినా గౌరవం కలిగి ఉండాలని ఆశిస్తాం. దీనిని నువ్వు పీఓకే తో పోల్చటం భయంకరం.’’

అయితే.. ‘‘నేను సెప్టెంబరు 9న ముంబయికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు ముంబయి విమానాశ్రయంలో దిగగానే సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తాను. ఎవరికైనా ధైర్యముంటే నన్ను ఆపండి..’’అని ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ ప్రకటించటం కొసమెరుపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని