Updated : 04 Dec 2020 17:57 IST

అన్నదాతల బాధలు వినండి: కార్తి

రైతులకు హీరో మద్దతు

చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దిల్లీలో చేస్తున్న ఆందోళనలకు తమిళ కథానాయకుడు కార్తి మద్దతు తెలిపారు. ఆయన గత కొన్ని రోజులుగా ఉళవన్‌ ఫౌండేషన్‌ ద్వారా రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. తన వంతు ఆర్థిక సాయం అందించి, అన్నదాతల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వెండితెరపై రైతుగానూ కనిపించారు.

మరోపక్క దిల్లీ-హరియాణా మార్గంలోని సింఘు, టిక్రి రహదారులపై రైతులు బైఠాయించి, శాంతియుతంగా సాగిస్తున్న నిరసన తొమ్మిదో రోజుకు చేరింది. ఎముకలు కొరికే చలిలోనూ పట్టువదలకుండా ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతుగా ఉళవన్‌ ఫౌండేషన్‌ తరుఫున కార్తి తమిళంలో ఓ ప్రకటన విడుదల చేశారు. ‘పొలాల్లో చెమటోడ్చి మనకు రోజూ అన్నం పెడుతున్న రైతన్నలు ఆందోళన ప్రారంభించి వారం రోజులైంది. దారుణమైన చలి, కరోనా వైరస్‌ వల్ల ప్రమాదం పొంచి ఉన్నా రైతులంతా కలిసి ఐకమత్యంగా పోరాడుతున్నారు. రైతులు తమ కుటుంబాల్ని, పంటల్ని, పశువుల్ని విడిచిపెట్టి మరీ పోరాడుతున్నారన్న వార్తలు దేశ ప్రజల్ని కదిలించాయి. ఇప్పటికే నీటి కొరత, ప్రకృతి వైపరిత్యాలు, పంటకు కనీస మద్దతు ధర లేకపోవడం తదితర సమస్యలతో సతమతమవుతున్న వారి జీవితాలపై ఇప్పుడు ఈ మూడు నూతన వ్యవసాయ చట్టాలు మరింత ప్రభావం చూపుతున్నాయి. ఈ చట్టాలు ఇప్పటికే ఆర్థికంగా దృఢంగా ఉన్న వ్యవసాయ మార్కెట్లు, దళారులకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని రైతులు బలంగా విశ్వసిస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రైతుల అభ్యర్థనలు విని, పరిష్కార దిశగా అడుగులు వేయాలని కోరుతున్నా’ అని కార్తి పేర్కొన్నారు.

గురువారం దిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో రైతులు, కేంద్ర మంత్రులకు మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. మూడు చట్టాల్లోని అన్ని అంశాలపై ప్రభుత్వం పూర్తి సమాచారంతో వివరణ ఇచ్చింది. అయితే కేంద్రం వివరణను రైతు నాయకులు తిరస్కరించారు. చట్టాల్లో చాలా లొసుగులు, లోపాలు ఉన్నాయని తమ వాదన వినిపించారు. దాదాపు ఎనిమిది గంటలపాటు జరిగిన సంప్రదింపులు ఎటూ తేలకపోవడంతో శనివారం మరోమారు భేటీ కానున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని