Kiran Abbavaram: అవకాశం విలువ తెలుసు

‘‘ఇంటికి ఓ అతిథి వస్తేనే ఎంతో బాగా చూసుకుంటాం. అలాంటిది డబ్బు పెట్టి థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పరచకూడదనేది నా సిద్ధాంతం. అందుకే మంచి కథల్ని ఎంపిక చేసుకుని

Updated : 03 Mar 2022 08:54 IST

‘‘ఇంటికి ఓ అతిథి వస్తేనే ఎంతో బాగా చూసుకుంటాం. అలాంటిది డబ్బు పెట్టి థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పరచకూడదనేది నా సిద్ధాంతం. అందుకే మంచి కథల్ని ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నా’’ అన్నారు కిరణ్‌ అబ్బవరం. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సెబాస్టియన్‌ పి.సి.524’. నువేక్ష (నమ్రతా దారేకర్‌), కోమలి ప్రసాద్‌ కథా నాయికలు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. బి.సిద్ధారెడ్డి నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల  హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. కథా నాయకులు అడివి శేష్‌, ఆకాష్‌ పూరి, సాయికుమార్‌, సప్తగిరి, దర్శకులు వెంకీ కుడుముల, వేణుశ్రీరామ్‌, నిర్మాతలు రవిశంకర్‌, చెర్రీ, కోడి దివ్య తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘‘చిత్ర పరిశ్రమలో అవకాశం విలువ తెలిసినవాణ్ని. కెమెరా ముందు నిల్చోవడమే అదృష్టంగా భావిస్తున్నా. నన్ను నమ్మి నాతో ఆరు సినిమాలు చేస్తున్న నిర్మాతలకి కృతజ్ఞతలు. వారి నమ్మకాన్ని వమ్ము చేయను. నేను ఏ సినిమా చేసినా దాని టీజర్‌, ట్రైలర్‌ నచ్చితేనే థియేటర్‌కి రమ్మని చెబుతాను. జిబ్రాన్‌ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. నన్ను హీరోని చేసి, మా నుంచి దూరమైన మా అన్నయ్యకి ఈ సినిమాని అంకితం చేస్తున్నా’’ అన్నారు. దర్శకుడు మాట్లాతూ ‘‘తెరపై సెబాస్టియన్‌  కనిపించేలా ఈ సినిమా చేశా. ఆ పాత్రలో కిరణ్‌ చాలా బాగా నటించారు. 36 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశాం’’ అన్నారు. ‘‘నేను ఎలాంటి కథలు చేయాలనుకుంటానో, అలాంటి కథల్నే ఎంచుకుని సినిమాలు చేస్తుంటారు కిరణ్‌ అబ్బవరం. అందుకే తనంటే ఇష్టం. ఈ చిత్రంతో మరో మంచి విజయం సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు అడివి శేష్‌. ఈ కార్యక్రమంలో గీత రచయిత భాస్కరభట్లతోపాటు చిత్రబృందం పాల్గొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని