Updated : 13 Mar 2022 08:50 IST

Kandikonda: గువ్వను.. మువ్వనూ పాడమన్న కలం మూగబోయింది

అనారోగ్యంతో పాటల రచయిత ‘కందికొండ’ మృతి

ళ్లీ కూయవే గువ్వా.. మోగిన అందెల మువ్వ’ అంటూ గువ్వను, మువ్వను పాడమని అడిగిన ఆ కలం మూగబోయింది. ఆహ్లాదకరమైన, ఆదర్శమైన పాటలు రాసిన ప్రముఖ గేయ రచయిత కందికొండ(49) కన్నుమూశారు. ఆయన అసలు పేరు కందికొండ యాదగిరి. పదేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతూ శనివారం హైదరాబాద్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఆర్థిక ఇబ్బందులు వెన్నాడుతున్నా..  స్నేహితుల సహకారంతో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత వెన్నెముక సమస్య ఇబ్బంది పెట్టడంతో శస్త్ర చికిత్స చేయించు కున్నారు. అయినా క్యాన్సర్‌ మహమ్మారి ప్రభావం ఆయన్ను మృత్యుఒడిలోకి నెట్టింది. తెలంగాణలో ప్రముఖ గేయ రచయితగా కందికొండ బోనాల పాటలతో జానపదాలను జనంలోకి తీసుకువెళ్లగలిగారు. వరంగల్‌  జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లికి చెందిన కందికొండ ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్‌ చదివారు. ఆయనకు భార్య రమ, ఇద్దరు పిల్లలు ప్రభంజన్‌, మాతృక ఉన్నారు. తెలుగు సాహిత్యం, రచనలపై తనకున్న ఆసక్తితో సినీ రంగం వైపు అడుగులు వేశారు. కందికొండకు ఇంటర్‌ చదువుతున్నప్పుడు సినీ సంగీత దర్శకుడు చక్రితో స్నేహం ఏర్పడింది. 2001లో పూరీ జగన్నాథ్‌ తీసిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’లో ‘మళ్లీ కూయవే గువ్వా’ ఆయన తొలి గీతం. ఆ తర్వాత ‘ఇడియట్‌’, ‘సత్యం’, ‘పోకిరి’, ‘టెంపర్‌’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ తదితర చిత్రాల్లో హుషారెత్తించే పాటలు రాశారు. 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు. ఇటీవల ‘కోతలరాయుడు’ చిత్రానికి రాసిన పాట ఆఖరిది.

బతుకమ్మ పాటలతో...

సినిమా గీతాలతో పాటు బతుకమ్మ పాటలు, జానపదాలు రాయడంలో కందికొండ దిట్ట. తొలుత ఆయన ఈ పాటలతోనే అభిమానులను సంపాదించుకున్నారు. 25 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చి, కల్యాణ్‌నగర్‌లో స్థిరపడ్డారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న  ఆయన గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా సమయంలో ఆయన కుటుంబ పరిస్థితి మరింత దిగజారింది.  మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు కందికొండకు చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇంటికే పరిమితమైన ఆయనకు  శ్వాస ఆడకపోవడంతో శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం

‘తన పాట ద్వారా తెలంగాణ సంస్కృతిని అజరామరంగా నిలిపారు కందికొండ. ఆయన మరణం సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు లోటు. కందికొండను కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌, సినీ పరిశ్రమకు చెందిన పలువురు కందికొండ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- న్యూస్‌టుడే, అమీర్‌పేట

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని