నిర్మాతల నష్టాన్ని విశాలే భరించాలి: హైకోర్టు

‘యాక్షన్‌’ సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతలకు కథానాయకుడు విశాల్‌ డబ్బులు చెల్లించాలని మద్రాస్‌ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. విశాల్‌, తమన్నా జంటగా.. సుందర్‌.సి దర్శకత్వంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కిన ఫుల్‌టైమ్‌ యాక్షన్‌ చిత్రం ‘యాక్షన్‌’. గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది.

Updated : 09 Oct 2020 16:26 IST

రూ8.29 కోట్లు చెల్లించాలి

ముంబయి: ‘యాక్షన్‌’ సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతలకు కథానాయకుడు విశాల్‌ డబ్బులు చెల్లించాలని మద్రాస్‌ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. విశాల్‌, తమన్నా జంటగా.. సుందర్‌.సి దర్శకత్వంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కిన ఫుల్‌టైమ్‌ యాక్షన్‌ చిత్రం ‘యాక్షన్‌’. గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకొంది. అయితే, ఈ చిత్రాన్ని అతి తక్కువ బడ్జెట్‌లో నిర్మించాలని చిత్ర నిర్మాణ సంస్థ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ తొలుత భావించినప్పటికీ... ‘సినిమా కనీసం రూ.20 కోట్లు వసూలు చేయకపోతే ఆ నష్టాన్ని నేను భరిస్తా’ అని విశాల్‌ ఇచ్చిన మాట మేరకు రూ.44 కోట్ల‌తో ‘యాక్షన్‌’ను నిర్మించారు.

కాగా, ‘యాక్షన్‌’ చిత్రం తమిళనాడులో రూ.7.7 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. దీంతో నష్టాల గురించి విశాల్‌తో చర్చించగా.. తాను కథానాయకుడిగా తెరకెక్కించనున్న ‘చక్ర’ చిత్రాన్ని ట్రైడెంట్‌ బ్యానర్‌పైనే నిర్మిస్తానని చెప్పారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆ సినిమాని తన సొంత బ్యానర్‌లో విశాల్‌ నిర్మిస్తున్నాడని పేర్కొంటూ నిర్మాతలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ‘యాక్షన్‌’ సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతలకు విశాలే డబ్బులు చెల్లించాలని తెలిపింది. నష్టాలు భర్తీ చేసే విధంగా రూ.8.29 కోట్లకు విశాల్‌ గ్యారెంటీ ఇవ్వాలని న్యాయమూర్తి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని