Published : 10 Nov 2020 01:54 IST

ఆ ఒక్క ఛాన్స్‌.. దీపికను స్టార్ చేసింది!

ఉపేంద్రతో కన్నడ చిత్రం‌ తర్వాత..

ముంబయి: సినీ స్టార్స్‌ ఎన్ని సినిమాల్లో నటించినా.. మొదటి చిత్రానికి ఉండే ప్రాముఖ్యం, విలువ వేరు. ‘ఒక్క ఛాన్స్‌’ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన నటులు ఎందరో. నేడు బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా రాణిస్తున్న దీపికా పదుకొణె నటించిన తొలి సినిమా ‘ఐశ్వర్య’ (2006). తెలుగు చిత్రం ‘మన్మథుడు’కు కన్నడ రీమేక్‌ ఇది. నాగార్జున పాత్రలో ఉపేంద్ర నటించారు. దీని తర్వాత దీపిక ‘ఓం శాంతి ఓం’తో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు కూడా అందుకున్నారు. ఫరా ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుక్‌ ఖాన్‌ కథానాయకుడు. 2007లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. సోమవారంతో (నవంబరు 9) ఈ చిత్రం విడుదలై 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ‘ఓం శాంతి ఓం’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

* బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు జోడీగా నటించాలనేది ప్రతి నటి కల. అలాంటిది దీపిక తొలి హిందీ సినిమా కోసం ఆయనతో కలిసి నటించడం అదృష్టమనే చెప్పాలి. దీనికి కారణం నటి మలైకా అరోరా. ‘ఓం శాంతి ఓం’ కోసం ఓ మోడల్‌ కావాలని ఫరా ఖాన్‌.. మలైకాను అడిగారు. ఆమె దీపికను సిఫార్సు చేశారు. అలా ‘మస్తానీ’ అరంగేట్రం జరిగింది.

* ‘దీవాంగీ దీవాంగీ..’ పాటతో ఫరా ఖాన్‌ ప్రేక్షకులకు ట్రీట్‌ ఇచ్చారు. ఇందులో 31 మంది స్టార్స్‌ నటించడం గొప్ప విషయం. అయితే ఇదే పాట కోసం ఆమిర్‌ ఖాన్‌, దేవ్‌ ఆనంద్‌ను సంప్రదించగా.. తిరస్కరించారు.

* ముఖేష్‌ మెహ్రా పాత్ర కోసం దర్శక, నిర్మాతలు తొలుత వివేక్‌ ఒబెరాయ్‌ను కలిశారు. కానీ కొన్ని కారణాల వల్ల చివరికి అర్జున్‌ రామ్‌పాల్‌ దాన్ని పోషించారు.

* ఈ చిత్రంలోని సన్నివేశాల్లో పాత కార్లను చూపించారు. అవి నటులు రాజేష్‌ ఖన్నా, హేమ మాలినీకి చెందినవి.

* ఓ పాటలో షారుక్‌ సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తారు. ఆ లుక్‌ కోసం ఆయన దాదాపు మూడు నెలలు శ్రమించారు.

* ఇందులోని పాత్రల ఫ్యాషన్‌, స్టైల్‌ను మనీష్‌ మల్హోత్రా, కరణ్‌ జోహార్‌, సంజీవ్‌ చూసుకున్నారు. నటీనటుల కాస్ట్యూమ్స్‌కు ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts