దిల్లీ నుంచి ఆమే కంట్రోల్‌ చేస్తుంది: షారుక్‌ భార్య

ముంబయిలోని అత్యంత ఖరీదైన భవనాల్లో బాలీవుడ్‌ కథానాయకుడు షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’ ఒక్కటి. ఈ ఇంటి విలువ రూ.200 కోట్ల కంటే ఎక్కువేనట. తన ఆస్తుల్లో ఇది అత్యంత ఖరీదైనదని షారుక్‌ ఓ సందర్భంలో అన్నారు. ‘మీ మన్నత్‌లో ఓ గది అద్దెకు కావాలి, ఎంత ఖర్చు అవుతుంది?....

Published : 29 Sep 2020 01:19 IST

రూ.200 కోట్ల మన్నత్‌ను ఉద్దేశిస్తూ..

ముంబయి: ముంబయిలోని అత్యంత ఖరీదైన భవనాల్లో బాలీవుడ్‌ కథానాయకుడు షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’ ఒక్కటి. ఈ ఇంటి విలువ రూ.200 కోట్ల కంటే ఎక్కువేనట. తన ఆస్తుల్లో ఇది అత్యంత ఖరీదైనదని షారుక్‌ ఓ సందర్భంలో అన్నారు. ‘మీ మన్నత్‌లో ఓ గది అద్దెకు కావాలి, ఎంత ఖర్చు అవుతుంది?’ అని ఇటీవల ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘30 ఏళ్ల శ్రమ ఖర్చవుతుంద’ని షారుక్‌ అన్నారు. బాద్‌షా సతీమణి, ఇంటీరియర్‌ డిజైనర్‌ గౌరీ ఖాన్‌ మన్నత్‌లో దిగిన ఫొటోల్ని తరచూ అభిమానులతో పంచుకుంటూ.. ఆశ్చర్యపరుస్తుంటారు. భవనాన్ని చక్కగా అలంకరించిన తీరు అనేకమార్లు నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో గౌరీ తాజా ఇంటర్వ్యూలో తన ఇంటి గురించి ముచ్చటించారు. దిల్లీలో నివాసం ఉండే తన తల్లి సవితా చిబా అక్కడి నుంచే మన్నత్‌ పనుల్ని చూసుకుంటుంటారని తెలిపారు.

‘దిల్లీలో ఉన్న మా అమ్మ మన్నత్‌లోని సిబ్బందికి తరచూ కాల్‌ చేస్తుంటారు. వాట్సాప్‌లో మాట్లాడుతుంటారు. హౌస్‌ క్లీనింగ్‌తోపాటు అలంకరణ తదితర విషయాల్ని ఆమే చూసుకుంటారు. దీని వల్ల రెండు లాభాలున్నాయి. అమ్మ బిజీగా ఉంటారు, సిబ్బంది క్రమశిక్షణతో పనిచేస్తారు. ఇంటిని ఆమే కంట్రోల్‌ చేస్తుంటారు. ‘ఇంట్లోని వస్తువులు, బొమ్మలు వెనక్కి జరిగాయి, ముందుకు ఉన్నాయి, ఇక్కడ చెత్త ఉంది, అక్కడ బాగోలేదు, శుభ్రం చేయండి..’ అంటూ అంతా ఫోన్‌లోనే మాట్లాడుతుంటారు. నేను ఆమె నుంచి చాలా నేర్చుకున్నా, నా దగ్గర లేకపోయినా ఎంతో సాయం చేస్తుంటారు’ అని అన్నారు.

లాక్‌డౌన్‌లో గౌరీ ఖాన్‌ ‘కాఫీ టేబుల్‌’ అనే పుస్తకాన్ని రాశారు. దీన్ని త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు పేర్కొన్నారు. డిజైనర్‌గా తన ప్రయాణంతోపాటు ఈ రంగంలో రాణించాలనుకునే వారికి సూచనలు ఇస్తూ ప్రత్యకమైన ఫొటోల్ని పుస్తకాల్లో ఉంచినట్లు తెలిపారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని