చిరు చెప్పిన ఆఖరి మాటలు అవే: మేఘన

‘బేబీ.. నేను ఫీనిక్స్‌ పక్షిలా.. బూడిద నుంచి మళ్లీ జన్మిస్తా..!’ అని చిరంజీవి సర్జా.. తన ప్రియమైన సతీమణి మేఘనారాజ్‌తో తరచూ

Updated : 09 Oct 2020 18:08 IST


బెంగళూరు: ‘బేబీ.. నేను ఫీనిక్స్‌ పక్షిలా.. బూడిద నుంచి మళ్లీ జన్మిస్తా..!’ అని చిరంజీవి సర్జా.. తన ప్రియమైన సతీమణి మేఘనారాజ్‌తో తరచూ చెబుతూ ఉండేవారట. చిరు-మేఘన మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని చూసి ఎంతోమంది మురిసిపోయేవారు. కొన్నినెలల్లో తమ మొదటి సంతానాన్ని ఆనందంగా ఆహ్వానించాలనుకున్న తరుణంలో చిరు అకాలమరణం మేఘన జీవితంలో తీరని లోటును మిగిల్చింది. అయితే ఇటీవల మేఘనా రాజ్‌కి కుటుంబసభ్యులు సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. వేడుకలో భాగంగా చిరు కటౌట్‌ని మేఘన పక్కనే ఉంచారు. కాగా, తాజాగా మేఘన ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆమె ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అలాగే చిరు ఆఖరి మాటలు గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

సీమంతం వేడుక.. చిరు ఇలా అనుకున్నాడు..!

‘మా ప్రేమానుబంధానికి గుర్తుగా కలగనున్న మొదటి సంతానం గురించి మేమిద్దరం ఎంతో సంతోషించాం. సీమంతం వేడుక విషయంలో చిరు ఎన్నో ప్లాన్‌లు వేశాడు. కానీ, నేను మాత్రం ఆ వేడుక కుటుంబసభ్యుల సమక్షంలో నివాసంలోనే జరగాలని భావించాను. దానికి చిరు కొంచెం నిరాశపడినప్పటికీ.. సీమంతం వేడుకను రెండు కార్యక్రమాలుగా చేయాలనుకున్నాడు. ఒకటి కుటుంబసభ్యులతో.. మరొకటి సన్నిహితులు, స్నేహితులతో వేడుకగా నిర్వహించాలనుకున్నాడు. కానీ చిరు అకాల మరణంతో మా కలలన్నీ ఒక్కసారిగా చెదిరిపోయాయి. కానీ ఇటీవల మా కుటుంబసభ్యులు, స్నేహితులు నాకు సీమంతం వేడుక నిర్వహించారు. వేడుకలో భాగంగా చిరు కటౌట్‌ని నా పక్కనే ఉంచారు. చిరు ఫొటోని చూసేసరికి కన్నీళ్లు ఆగలేదు. నన్ను ఒక్కదానినే వదలనని చిరు తరచూ చెబుతుండేవాడు. ‘ఫీనిక్స్‌ పక్షిలాగా నేను కూడా బూడిద నుంచి మళ్లీ జన్మిస్తా’ అని చెప్పేవాడు. 

‘నా గురించి నువ్వు కంగారు పడొద్దు’

జూన్‌7న ఉదయం నేను, ధ్రువ్‌(చిరు సోదరుడు), అతని సతీమణి ఇంటి ఆవరణలో ఉన్నాం. ఆ సమయంలో మామయ్య(చిరు తండ్రి) ఫోన్‌ చేసి.. తనతో ఫోన్‌ మాట్లాడుతూ చిరు కుప్పకూలిపడిపోయాడని చెప్పాడు. దాంతో మేం ముగ్గురం కంగారుగా లోపలికి వెళ్లాం. అప్పటికే చిరు స్పృహ కోల్పోయాడు. నాకు చాలా భయమేసింది. ఆయన్ని కళ్లు తెరవమని గట్టి గట్టిగా పిలిచా. ఆ సమయంలో ఆయన కళ్లు తెరిచి.. ‘నా గురించి నువ్వు కంగారు పడొద్దు’ అని చెప్పారు. అవే ఆయన ఆఖరి మాటలు. వెంటనే మేము దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాం. వైద్యులు గుండెపోటు అని చెప్పారు. కొంతసమయానికే అంతా శూన్యంలా మారిపోయింది.’ అని మేఘన భావోద్వేగానికి గురయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని