చంపేస్తామని బెదిరిస్తున్నారు: నటి

తనను, కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని బుల్లితెరñ నటి మాల్వీ మల్హోత్రా పేర్కొన్నారు. అక్టోబరు 26న ఆమెపై నిర్మాత యోగేశ్‌ మహిపాల్‌ సింగ్‌ దాడి చేసిన సంగతి తెలిసిందే. తనతో వివాహానికి నిరాకరించిందని కత్తితో దాడికి పాల్పడ్డారు. ముంబయి వెర్సోవా ప్రాంతంలోని ఓ కేఫ్‌ నుంచి.....

Published : 24 Nov 2020 19:24 IST

ముంబయి: తనను, కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని బుల్లితెరñ నటి మాల్వీ మల్హోత్రా ఆందోళన వ్యక్తంచేశారు. అక్టోబరు 26న ఆమెపై నిర్మాత యోగేశ్‌ మహిపాల్‌ సింగ్‌ దాడి చేసిన సంగతి తెలిసిందే. తనతో వివాహానికి నిరాకరించిందని కత్తితో దాడికి పాల్పడ్డారు. ముంబయి వెర్సోవా ప్రాంతంలోని ఓ కేఫ్‌ నుంచి మాల్వీ ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్‌ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసుకున్న వెర్సోవా పోలీసులు దాడి జరిగిన మరుసటి రోజే యోగేశ్‌ను అరెస్టు చేశారు.

కాగా మాల్వీ మరోసారి పోలీసుల్ని ఆశ్రయించారు. యోగేశ్‌కు వ్యతిరేకంగా కేసు పెట్టినందుకు చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాల్వీ మీడియాతో మాట్లాడుతూ.. ‘నవంబరు 18న రాత్రి 9 గంటల ప్రాంతంలో నా తల్లిదండ్రులతో కలిసి మా ఇంటి ఆవరణలో వాకింగ్‌ చేస్తూ ఉన్నా. ఆ సమయంలో మాస్కు ధరించిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంతో నాపైకి దూసుకొచ్చాడు. ‘యోగేశ్‌కు త్వరలో బెయిల్‌ వస్తుంది. ఆ తర్వాత మీ కుటుంబం అంతు చూస్తాం’ అని మా నాన్నను చూసి గట్టిగా అరిచాడు. అప్పటి నుంచి నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. మరో ఇంటికి షిఫ్ట్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.

అనంతరం తన ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ.. ‘ఇంకా నా గాయాలు నయం కాలేదు. కేవలం వైద్య పరీక్షల కోసం మాత్రమే ఇంటి నుంచి బయటికి వెళ్తున్నా. సాయంత్రం కొంతసేపు నడవమని సూచించారు. కత్తి గాయాల వల్ల సరిగ్గా నడవలేకపోతున్నా. దాని కోసం వ్యాయామం చేయమన్నారు. యోగేశ్‌పై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’ అని మాన్వీ పేర్కొన్నారు. ఆమె ‘ఉడాన్‌’, ‘హోటెల్‌ మిలాన్‌’ టీవీ షోలతో మంచి గుర్తింపు పొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని