నేను కరోనాను అలా జయించా: నాగబాబు

నటుడు, నిర్మాత నాగబాబు కరోనాను జయించారు. ఇటీవల తాను కరోనా బారిన పడినట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, 14రోజు హోం

Published : 26 Sep 2020 20:16 IST

హైదరాబాద్‌: నటుడు, నిర్మాత నాగబాబు కరోనాను జయించారు. ఇటీవల తాను కరోనా బారిన పడినట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, 14రోజు హోం ఐసోలేషన్‌ తర్వాత తాను ఎదుర్కొన్న అనుభవాలు, తీసుకున్న జాగ్రత్తలు, కోలుకున్న విధానాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఓ ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు.

‘‘ఇప్పటి వరకు నేను ఐదు సార్లు కరోనా పరీక్ష చేయించుకున్నా. నిహారిక నిశ్చిర్థానికి ముందు కూడా నాతో సహా నా కుటుంబంలోని అందరికీ టెస్ట్‌ చేయించాం. అందరికీ నెగెటివ్‌ వచ్చింది. తాజాగా కాస్త చలి, జ్వరం, మత్తుగా అనిపించడంతో ఎందుకైనా మంచిదని మరోసారి టెస్ట్‌ చేయిస్తే సాయంత్రానికి పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఒక క్షణం ఆందోళనకు గురయ్యా. ఆస్పత్రి వెళ్లి, అవసరమైన పరీక్షలు చేయించుకున్నా. నాకు గతంలో న్యుమోనియా ఉండటంతో మా కజిన్‌ శ్యామ్‌ సూచన మేరకు ఆస్పత్రిలో చేరగా, ఐదు రోజులు రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని ఇచ్చారు. జ్వరం, ఒళ్లు నొప్పులు తప్ప ఎటువంటి ఇబ్బంది నాకు కలగలేదు’’

‘‘కరోనా వైరస్‌కు ఎవరూ అతీతులు కాదు.మనం వెయ్యి జాగ్రత్తలు తీసుకుంటే, అది లక్ష దారుల గుండా దాడి చేయడానికి అది ప్రయత్నిస్తుంది. జ్వరం, దగ్గు, జలుబు ఏది ఉన్నా సరే  నిర్లక్ష్యం చేయకుండా కరోనా పరీక్ష చేయించుకోండి. కరోనాకు మందు లేదు. ఎవరైనా మందు ఉందని చెబితే నమ్మకండి. కరోనా సోకితే ఒకరికి ఇచ్చిన చికిత్స మరొకరికి ఇవ్వరు. వైరస్‌లోడును బట్టి చికిత్సను అందిస్తారు. కరోనా వైరస్‌ 14 రోజుల తర్వాత దానంతటదే చచ్చిపోతుంది. 14 రోజుల తర్వాత వైరస్‌ ఉన్నా సరే మనకు ఎటువంటి హాని కలగదు. నేను కనీసం నాలుగు నుంచి ఐదు సార్లు యాంటీబాడీలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలనే ఈ వీడియో పంచుకున్నాను’’ అని నాగబాబు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని