Nallamala: ఇది పెద్ద కథే.. అన్నారు త్రివిక్రమ్‌

‘‘బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న సమయంలో నల్లమల అడవుల్లోకి మానవ రూపంలో ఓ క్రూరమృగం చొరబడింది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందనేదే మా చిత్ర కథ’’

Updated : 17 Mar 2022 08:10 IST

‘‘బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న సమయంలో నల్లమల అడవుల్లోకి మానవ రూపంలో ఓ క్రూరమృగం చొరబడింది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందనేదే మా చిత్ర కథ’’ అంటున్నారు దర్శకుడు రవిచరణ్‌. ఆయన తొలి ప్రయత్నంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘నల్లమల’. అమిత్‌ తివారీ, భాను జంటగా నటించారు. ఆర్‌.ఎం.నిర్మాత. ఈ నెల 18న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రవిచరణ్‌ ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు. స్వాతంత్య్రం వచ్చిన పదేళ్లకి జరిగిన కథగా ఈ సినిమాని రూపొందించినట్టు ఆయన చెప్పారు. ‘‘మన తెలుగు కథ. చాలా  తక్కువమందికి తెలిసిన కథ. నాలుగు నెలలు ఆధ్యయనం చేసి... కొన్ని కల్పితాల్ని జోడించి రాశా. నల్లమల అడవుల్లో జరిగిన నిజమైన ఘటనల స్ఫూర్తితో రాసుకున్నా. నాది ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగు. అటవీ ప్రాంతంలోనే పుట్టి పెరిగాను కాబట్టి అడవుల్లో మనుషుల జీవన శైలి ఎలా ఉంటుందో తెలుసు. దాంతో ఈ సినిమా తీయడం సులభమైంది. తొలి షెడ్యూల్‌ ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అడవుల్లో ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్లి చిత్రీకరణ చేశాం. పులుల భయం ఓ పక్క, మరోవైపు అదే సమయంలో ఓ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. స్థానికుల సహకారంతో బయటపడ్డాం. పాత్రలకి తగ్గట్టుగా కనిపించడంతోనే అమిత్‌, భానులని ఎంపిక చేశాం. ఈ సినిమాలోని ప్రతీ పాత్ర అడవి తల్లి ఒడిలో ఒదిగినట్టుగా ఉంటుంది. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ‘ఏమున్నావే పిల్ల..’ పాటతో మా సినిమా గురించి ప్రపంచానికి తెలిసింది. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని దర్శకుడు త్రివిక్రమ్‌ విడుదల చేశారు.  సినిమా గురించి చెప్పగానే ‘పెద్ద కథే చెబుతున్నావు. ఇది మంచి కథ. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చెయ్య’మని భుజం తట్టారు. వినోదంతోపాటు, సందేశం ఉన్న చిత్రమిద’’ని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు