లాక్‌డౌన్‌ తర్వాత మొదటి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌..!

లాక్‌డౌన్‌ కారణంగా ఆడియో ఫంక్షన్స్‌, ప్రీరిలీజ్‌ ఈవెంట్స్‌, సక్సెస్‌ మీట్స్‌ లేక సినిమా ఇండస్ట్రీ బోసిపోయిందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే దాదాపు ఐదారు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్‌ కూడా పట్టాలెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజ్‌ తరుణ్‌, మాళవికా నాయర్‌ జంటగా నటించిన ‘ఒరేయ్‌ బుజ్జిగా’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

Published : 30 Sep 2020 10:40 IST

సర్‌ప్రైజ్‌ ఇచ్చిన రాజ్‌ తరుణ్‌..!

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా ఆడియో ఫంక్షన్స్‌, ప్రీరిలీజ్‌ ఈవెంట్స్‌, సక్సెస్‌ మీట్స్‌ లేక సినిమా ఇండస్ట్రీ బోసిపోయింది. అయితే దాదాపు ఐదారు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్‌ కూడా పట్టాలెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజ్‌ తరుణ్‌, మాళవికా నాయర్‌ జంటగా నటించిన ‘ఒరేయ్‌ బుజ్జిగా’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. లాక్‌డౌన్‌ తర్వాత జరిగిన మొట్టమొదటి ప్రీరిలీజ్‌ వేడుక ఇదే కావడం విశేషం. అతి తక్కువ మంది అతిథులతో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా మాట్లాడుతూ.. ‘కుటుంబం మొత్తాన్ని నవ్వించే ఫుల్‌ టైమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాన్ని తెరకెక్కించాలని మూడేళ్ల క్రితమే అనుకున్నాను. ఆ విషయాన్ని నా స్నేహితుడు నంధ్యాల రవికి చెప్పాను. అలా మేము ‘ఒరేయ్‌ బుజ్జిగా’ కథ రాసుకున్నాం. రవినే ఈ చిత్రానికి డైలాగ్స్‌ రాశారు. అనంతరం మేము రాజ్‌తరుణ్‌ని కలిసి కథ చెప్పాం. తప్పకుండా సినిమా చేద్దాం అన్నాడు. నిర్మాత రాధామోహన్‌ కూడా మా కథకు ఓకే అన్నారు. అయితే హీరోయిన్‌ పాత్ర కోసం ఎవర్ని తీసుకోవాలి అని ఆలోచించాం. అలాంటి సమయంలో మాళవికా నాయర్‌ ఈ పాత్రకు చక్కగా సరిపోతారని అనిపించింది. అలాగే మరో హీరోయిన్‌ పాత్రకు హెబ్బాపటేల్‌ నప్పుతారని భావించి ఆమెను ఎంచుకున్నాం. చాలారోజుల తర్వాత ఇలాంటి ఈవెంట్‌లో అందర్నీ చూస్తుంటే నాకు పండగ వాతావరణంలా ఉంది. ఉగాది పండగ రోజున థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసి మీ నవ్వుల్ని చూడాలనుకున్నాం. కానీ అనుకోని పరిణామం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఇలా ఇప్పుడు ‘ఆహా’ వేదికగా విడుదల చేస్తున్నాం. తప్పకుండా అందరూ ‘ఆహా’ వేదికగా సినిమా చూసి నవ్వుకోవాలని ఆశిస్తున్నాను’ అని దర్శకుడు విజయ్‌కొండా కోరారు.

హీరోయిన్‌ మాళవికా నాయర్‌ మాట్లాడుతూ.. ‘చాలారోజుల తర్వాత స్టేజ్‌పై ఇలా మైక్‌ పట్టుకుని మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది. ఫుల్‌టైమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాన్ని మీకు అందించడానికి ఏడు నెలల నుంచి ఎదురుచూస్తున్నాం. మీరు తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారని అనుకుంటున్నాను’ అని తెలిపారు. మరో కథానాయిక హెబ్బాపటేల్‌ మాట్లాడుతూ.. ‘‘ఒరేయ్‌ బుజ్జిగా’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కోసం ఏడు నెలల తర్వాత ముఖానికి మేకప్‌ వేసుకోవాల్సి వచ్చింది. ఎన్నో నెలల తర్వాత ఓ సినిమా ఫంక్షన్‌ కోసం రెడీ అవ్వడం హ్యాపీగా అనిపించింది. రాజ్‌తరుణ్‌తో కలిసి వర్క్‌ చేయడం నాకెప్పుడూ ఆనందంగానే ఉంటుంది. మాళవికా నాయర్‌ చాలా తెలివైన నటి.’ అని పేర్కొన్నారు.

హీరో రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్స్‌ జరుగుతాయని భావించలేదు. కానీ నేను నటించిన సినిమాకి ఇలాంటి ఈవెంట్‌ జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి ఈవెంట్‌ను ఏర్పాటు చేసినందుకు ‘ఆహా’, నిర్మాత రాధామోహన్‌గారికి ధన్యవాదాలు. మొదటిగా నా టీం మొత్తానికి థ్యాంక్స్‌ చెబుతున్నాను. నటుడిగానే కాకుండా ఈ సినిమా స్ర్కిప్ట్‌లో కూడా భాగమైన మధు, నాతో స్టెప్పులు వేయించిన శేఖర్‌ మాస్టర్‌కి ధన్యవాదాలు. మాళవికను ఈ చిత్రంలో కొత్త కోణంలో చూస్తారు.’

ఒక్కరోజు ముందుగానే ‘ఒరేయ్‌ బుజ్జిగా’
‘ఒరేయ్‌ బుజ్జిగా’ చిత్రాన్ని కొంచెం ముందుగా విడుదల చేయాలని తనకి ఎంతో మంది స్నేహితుల దగ్గర నుంచి మెస్సేజ్‌లు వస్తున్నాయని.. ‘ఆహా’, నిర్మాత రాధామోహన్‌ దానికి అంగీకరించాలని హీరో రాజ్‌ తరుణ్‌ కోరారు. దీంతో ప్రేక్షకుల కోరిక మేరకు ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చిత్రాన్ని ఒక్కరోజు ముందుగా.. అక్టోబర్‌ 1వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని