పెళ్లితో ఆ హక్కు పోయింది: అమితాబ్‌

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఇంట్లోని వారంతా వెండితెరపై తమ నటనతో అలరించినవారే.. ఒక్క శ్వేతా బచ్చన్‌ తప్ప. ఆమె 1997లో ప్రముఖ నటుడు రాజ్‌ కపూర్‌ మనవడు నిఖిల్‌ నందాను మనువాడారు. కుమారుడు అభిషేక్‌ .....

Published : 13 Dec 2020 14:28 IST

 

ముంబయి: బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వారసులంతా వెండితెరపై తమ నటనతో అలరించినవారే.. ఒక్క శ్వేతా బచ్చన్‌ తప్ప. ఆమె 1997లో ప్రముఖ నటుడు రాజ్‌ కపూర్‌ మనవడు నిఖిల్‌ నందాను మనువాడారు. కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ నటనను కెరీర్‌గా ఎంచుకున్నప్పుడు.. శ్వేత మాత్రం ఎందుకు కెమెరా ముందుకు రాలేదని 2001లో మీడియా అమితాబ్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘మా నలుగురిలో (ఆయన, జయ, శ్వేత, అభిషేక్‌) శ్వేత గొప్ప నటి. వివాహానికి ముందు సినిమాల్లోకి రావాలనుకుంటున్నానని ఆమె ఎప్పుడూ మాతో చెప్పలేదు. ఇప్పుడు ఆమెకు పెళ్లైంది. ఒకవేళ శ్వేతకు నటిగా రాణించాలని ఉంటే... అది ఆమె భర్త చేతుల్లో ఉంది. ఆమెపై మాకున్న హక్కు పెళ్లి రోజుతో పోయింది’ అని పేర్కొన్నారు.

2000లో నటుడిగా అరంగేట్రం చేసిన అభిషేక్‌ అప్పటికే పలు సినిమాల్లో కనిపించారు. కుమారుడిని ఉద్దేశించి బిగ్‌బి మాట్లాడుతూ.. ‘చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. అభిషేక్‌ సాధించాల్సింది చాలా ఉంది. అతడిలో ఆ సత్తా ఉందనే నమ్మకం నాకుంది. అతడి నైపుణ్యాన్ని తెరపై చక్కగా చూపించగలిగే వారు దొరకాలి. అతడి నటన విషయంలో మాత్రం నా అభిప్రాయం సూటిగా చెబుతుంటా. అభిషేక్‌ సినిమాల్ని మేమంతా కలిసి చూస్తుంటాం. జుట్టు, దుస్తులు, మూమెంట్స్‌, హావభావాలు, స్వరం.. ఇలా అన్నీ గమనించి, ఎక్కడ అభివృద్ధి అవసరమో చెబుతుంటా. చదువుల కోసం అభిషేక్‌ను చిన్న వయసులోనే విదేశాలకు పంపేశాం. దీంతో అతడికి హిందీ మాట్లాడటంలో సమస్యలు ఏర్పడ్డాయి. ఇప్పుడిప్పుడే భాషపై పట్టుసాధిస్తున్నాడు..’ అని చెప్పారు.

ఇవీ చదవండి..
రజనీ జీవితంలో ఆసక్తికర ఘటనలు తెలుసా?
రజనీ ‘రోబో’ను ఇలా షూట్‌ చేశారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని