థియేటర్లు తెరవగానే విడుదలయ్యే ఫస్ట్‌మూవీ

కరోనా వైరస్‌ కారణంగా మూతపడిన సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకోవడానికి కేంద్రం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.

Published : 11 Oct 2020 01:04 IST

 

ముంబయి: కరోనా వైరస్‌ కారణంగా మూతపడిన సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకోవడానికి కేంద్రం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 15న హాళ్లు తెరవగానే బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌ నటించిన ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రమే వాటిలో మొదట విడుదల కానుంది. సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ శనివారం సామాజిక మాధ్యమాల ద్వారా  ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 

‘వివేక్‌ ఒబెరాయ్ ప్రధాన పాత్ర పోషించిన ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రం వచ్చే వారం సినిమా హాళ్లలో విడుదల కానుంది. అఫీషియల్ పోస్టర్‌ ఈ విషయాన్ని వెల్లడి చేస్తోంది’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘లాక్‌డౌన్‌ తరవాత సినిమా హాళ్లలో విడుదలయ్యే మొదటి చిత్రమిది’ అంటూ చిత్రబృందం ఆ పోస్టర్‌ను విడుదల చేసింది. దాంతో పాటు బిగిన్‌ అగైన్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. అలాగే చిత్ర నిర్మాత సందీప్‌ సింగ్ ఈ వార్తపై స్పందించారు. ‘దేశంలో ఉత్తమ ప్రధాని నరేంద్ర మోదీ అని 2019 ఎన్నికలు నిరూపించాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సినిమాహాళ్లు తిరిగి తెరిచిన తర్వాత స్ఫూర్తి నింపే ఇలాంటి నాయకుడి కథను చూడటం కంటే మించింది ఏముంది?’ అని ట్వీట్ చేశారు. 

గతేడాది మే 24న విడులైన ఈ చిత్రంలో వివేక్‌తో పాటు బొమన్‌ ఇరానీ, మనోజ్‌ జోషి, జరీనా వాహబ్‌, రాజేంద్ర గుప్తా వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో మోదీ రాజకీయ జీవితం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని