నాన్న ఇప్పటికీ టీ స్టాల్‌ నడుపుతున్నాడు!

తన తండ్రి ఇప్పటికీ టీ కొట్టు పెట్టుకుని, జీవనం సాగిస్తున్నాడని ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ ధర్మేశ్‌ యెలండే పేర్కొన్నారు. ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌’ సీజన్‌లో పాల్గొన్న తర్వాత ఆయన కెరీర్‌ ఊహించని మలుపు తిరిగింది. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకురాలు .......

Published : 12 Dec 2020 18:08 IST

ప్యూన్‌గా పనిచేస్తూ.. పిల్లలకు డ్యాన్స్ పాఠాలు చెప్పా.. ‌

ముంబయి: తన తండ్రి ఇప్పటికీ టీ కొట్టు పెట్టుకుని, జీవనం సాగిస్తున్నాడని ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ ధర్మేశ్‌ యెలండే పేర్కొన్నారు. ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌’ సీజన్‌లో పాల్గొన్న తర్వాత ఆయన కెరీర్‌ ఊహించని మలుపు తిరిగింది. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకురాలు ఫరా ఖాన్‌ తొలి అవకాశం ఇచ్చారు. అక్షయ్‌ కుమార్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన ‘తీస్‌ మార్‌ ఖాన్‌’ చిత్రానికి కొరియోగ్రఫీ అందించే బాధ్యతలు అప్పగించారు. ఆపై ధర్మేశ్‌ డ్యాన్స్‌ ప్రధానాంశంగా రూపొందిన ‘ఏబీసీడీ’తో నటుడిగా పరిచయం అయ్యారు. ‘ఏబీసీడీ 2’, ‘బాంజో’, ‘స్ట్రీట్‌ డ్యాన్స్‌’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి, గుర్తింపు తెచ్చుకున్నారు.

ధర్మేశ్‌ తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి తాజాగా మీడియాతో పంచుకున్నారు. డ్యాన్స్‌ సాధన చేయడానికి ఇంట్లో స్థలం లేకపోవడం వల్ల వీధుల్లోకి వెళ్లేవాడినని చెప్పారు. ‘మున్సిపాలిటీ వాళ్లు మా నాన్న దుకాణాన్ని కూల్చేసినప్పుడు మా జీవితాలు తలకిందులయ్యాయి. నాన్న చిన్న టీ స్టాల్‌ పెట్టి, రోజుకు రూ.50 సంపాదించేవారు. ఆ డబ్బులతో ఇంట్లోని నలుగురిని పోషించడం కష్టంగా మారింది. మా పాఠశాల ఫీజు కోసం ప్రతి పైసా దాచేవాడు. ఆరో తరగతిలో నేను డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొని, బహుమతి గెలుచుకున్నా. నా నైపుణ్యాన్ని చూసిన నాన్న ప్రోత్సహించారు. డ్యాన్స్‌ క్లాసుల్లో చేర్పించారు. నా 19 ఏళ్ల వయసులో కళాశాలకు వెళ్లడం మానేశా. ప్యూన్‌గా పనిచేస్తూ.. పిల్లలకు డ్యాన్స్‌ క్లాసులు చెప్పా. నెలకు రూ.1600 సంపాదించేవాడ్ని. నా పనుల్నీ అయ్యాక డ్యాన్స్‌ సాధన చేయడానికి పరుగులు తీసేవాడ్ని. కొన్నాళ్లకు ఉద్యోగం మానేసి.. పూర్తిగా డ్యాన్స్‌పై దృష్టి పెట్టా. ఈ క్రమంలో సినిమాల్లోని పాటల్లో నేపథ్య డ్యాన్సర్‌గా చేశా’ అని ఆయన చెప్పారు.

ఆపై బాలీవుడ్‌లో రాణించాలనే కలతో గుజరాత్‌ నుంచి ముంబయికి షిఫ్ట్ అయ్యారు. ఓ డ్యాన్స్‌ రియాల్టీ షో విజేతగా నిలిచి, తన తండ్రి రూ.5 లక్షల అప్పు తీర్చారు. ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో చేతిలో ఉన్న డబ్బులు ఖాళీ అయ్యాయి. తిరిగి ఇంటికి చేరుకున్నట్లు ధర్మేశ్‌ తెలిపారు. ఆపై ఆయన ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌’ షోతో పాపులర్‌ అయ్యారు. ‘ఏబీసీడీ’ సినిమాలో అవకాశం ఆయన జీవితాన్ని మార్చేసింది. ‘నేను సంపాదిస్తున్న డబ్బులతో నా కుటుంబం కోసం ఓ ఇల్లు కొన్నా. ఇప్పటికీ నాన్న అదే టీ స్టాల్‌ నడుపుతున్నారు. ఇకపై పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పా. కానీ నా మాటలు వినలేదు. బహుశా.. నాకు ఇంత పట్టుదల నాన్న నుంచే వచ్చిందేమో..’ అని ధర్మేశ్‌ పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
తమన్నా హార్ట్‌ను బ్రేక్‌ చేసింది ఎవరు..?
ఏ దుస్తులు వేసుకున్నా ట్రోల్‌ చేస్తారు: అనన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని