Pathan: వాళ్లతో వాళ్లకే ‘ఢీ’

అగ్ర తారల సినిమాలు ఒకే రోజు బాక్సాఫీసు ముందు తలపడుతుంటాయి. ఇది చాలా సినిమాల విషయాల్లో చాలా సార్లు జరిగింది. ఒకేసారి ఓ హీరోయిన్‌, హీరో, దర్శకుడికి సంబంధించిన రెండు సినిమాలు విడుదల కావడం అరుదు. ప్రముఖ బాలీవుడ్‌

Updated : 04 Mar 2022 09:15 IST

గ్ర తారల సినిమాలు ఒకే రోజు బాక్సాఫీసు ముందు తలపడుతుంటాయి. ఇది చాలా సినిమాల విషయాల్లో చాలా సార్లు జరిగింది. ఒకేసారి ఓ హీరోయిన్‌, హీరో, దర్శకుడికి సంబంధించిన రెండు సినిమాలు విడుదల కావడం అరుదు. ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకొణె, కథానాయకుడు జాన్‌ అబ్రహం, ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ విషయంలో అదే జరగనుంది. షారుక్‌ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘పఠాన్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తోంది. ఇందులో దీపికా పదుకొణె కథానాయిక. జాన్‌ అబ్రహం ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. బుధవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌. ‘పఠాన్‌’ను రిపబ్లిక్‌ డే కానుకగా వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘‘ఇప్పటికే ఆలస్యం అయిందని తెలుసు. ‘పఠాన్‌’ విడుదల తేదీని గుర్తుపెట్టుకోండి. జనవరి 25, 2023న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో మీముందుకు వస్తున్నాం’’అని ట్విటర్‌లో రాశారు షారుక్‌ఖాన్‌. గతంలోనే హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’ విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ఫైటర్‌’ను వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికీ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనందే. ఇందులోనూ కథానాయిక దీపికా పదుకొణేనే కావడం విశేషం. ఈ సినిమా భారీ స్థాయి యాక్షన్‌ హంగామాతో హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతోంది. దీంతో ‘పఠాన్‌’, ‘ఫైటర్‌’ మధ్య బాక్సాఫీసు యాక్షన్‌ పోరు ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.


జాన్‌దీ అదే పరిస్థితి

‘పఠాన్‌’లో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు ప్రముఖ బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం. ఆయన నటించిన మరో సినిమా ‘టెహ్రాన్‌’. ఈ సినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డే కానుకగానే రానుంది. అరుణ్‌ గోపాలన్‌ దర్శకత్వంలో దినేష్‌ విజన్‌ నిర్మిస్తున్న చిత్రమిది. బాక్సాఫీసు వద్ద చిత్రాల మధ్య ఈ తరహా పోటీ అరుదు కావడంతో బాలీవుడ్‌లో దీనిపై చర్చ జరుగుతోంది. చివర్లో పరిస్థితులు మారితే విడుదల తేదీలు మారే అవకాశమూ లేకపోలేదు అంటున్నారు బాలీవుడ్‌ విశ్లేషకులు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని