అలా బతికిన ప్రతి మనిషి బాధపడతాడు: పూరి

అవినీతి ఎరుపు రంగులో ఉంటుందని అందుకే అది మన రక్తంలో కలిసిపోయిందని అంటున్నారు దర్శకుడు

Published : 07 Nov 2020 01:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అవినీతి ఎరుపు రంగులో ఉంటుందని అందుకే అది మన రక్తంలో కలిసిపోయిందని అంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్‌. ‘పూరి మ్యూజింగ్స్‌’ పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ‘కరప్షన్‌’ అనే అంశంపై మాట్లాడారు.

‘‘పదేళ్ల కొడుకుతో తల్లి.. ‘నాన్న బజారుకెళ్లి కూరగాయలు పట్టుకురా. అలాగే కిరాణా షాపునకు వెళ్లి ఈ సరకులు కూడా తీసుకురా’ అని అంటే, అప్పుడు కొడుకు ‘నాకు ఐస్‌క్రీమ్‌కి డబ్బులు ఇస్తే తీసుకొస్తా’ అంటాడు. ‘అలాగే నాన్న’ అంటుంది. మరోసారి ఇంకో పని చెబితే, ‘పానీ పూరికి డబ్బులిస్తేగానీ వెళ్లను’ అంటాడు. వాడిని చూసి మురిసిపోతూ ‘ఏంటో వీడికి ప్రతి దానికీ లంచమే’ అనుకుని ఆ తల్లి మురిసిపోతుంది. ఆ తర్వాత ఆ వెధవే ఏ ఆఫీసరో అవుతాడు. మనందరి సరదా తీర్చేస్తాడు. కన్నతల్లినే వదలని వాడు నిన్ను, నన్నూ ఎందుకు వదులుతాడు. ఇలా మారం చేసే పిల్లలతో ఈ ప్రపంచం నిండిపోయింది. పవర్‌ వల్ల ఎవడైనా లంచగొండి అవుతాడు. పవర్‌ ఉండటం తప్పు కాదు. ఆ పవర్‌ ఎవరి చేతుల్లో ఉన్నదనేదే పాయింట్‌. అందుకే చిన్నప్పుడు మారాం చేసిన పిల్లలందరూ పవర్‌ కోసం.. పవర్‌ఫుల్‌ పొజిషన్‌ కోసం ప్రయత్నిస్తారు. మెల్లగా అలాంటి జాబ్‌లో జాయిన్‌ అవుతారు. పెద్ద పెద్ద పోస్టులు అవసరం లేదు. చెక్‌పోస్ట్‌ దగ్గర స్టాంప్‌ వేసే పోస్ట్‌ దొరికితే చాలు. కుమ్మేస్తారు’’

‘‘ఎవరైనా రాజకీయ నాయకుడు అవినీతి చేసి, వేల కోట్లు నొక్కేశాడని తెలిస్తే , కోపంతో ఊగిపోతాం. అలా ఊగిపోయేవాడిని తీసుకెళ్లి అలాంటి పోస్టులో కూర్చోబెడితే వాడు అంతకంటే ఎక్కువ చేస్తాడు. భారతదేశంలో రాజకీయ నాయకుల కన్నా ప్రజలు బలవంతులు. ఓటు అడిగితే ఫుట్‌బాల్‌ ఆడుకుంటారు. ఇండియాలో పెట్టే ప్రతి సంతకం వెనుక అవినీతి ఉంది. వేసే ప్రతి ఓటు వెనుక లంచం ఉంది. అందుకే ప్రతి ఎన్నికలకు ఖర్చు రెట్టింపు అవుతోంది. పవర్‌లోకి రావాలన్నా, ఆ తర్వాత ఎన్నికల వరకూ బతికి ఉండాలన్నా డబ్బు కావాలి. ‘మీ తాత మినిస్టర్‌గా చేశాడంట కదా! ఒక్క ఆస్తీ సంపాదించలేదు’ అంటూ సొంత కుటుంబ సభ్యులు తిడతారు. నిజాయతీగా బతికిన ప్రతి మనిషి చనిపోయే ముందు బాధపడతాడు. ఎందుకంటే  నా అనుకున్న వాళ్లు కూడా వాళ్లతో ఉండరు. అవినీతి రంగు ఎరుపు. అందుకే మన రక్తంలో కలిసిపోయింది’’

‘‘వంద ఇచ్చినోడు దాన్ని మొహాన కొట్టాననుకుంటాడు.. వంద తీసుకున్నోడు దాన్ని నొక్కేశాననుకుంటాడు. ఇద్దరి కళ్లలో ఒక మెరుపు, తెలియని ఆనందం. ‘స్వామి.. ఈ డీల్‌ ఎలాగో అయ్యేలా చూడు. నీకూ ఏదో ఒకటి ఇస్తాం’ అని భగవంతుడుని ప్రార్థిస్తూ, ప్రతి మొక్కులోనూ పర్సంటేజీలు లెక్కగడతాం. ఇది కాకుండా మనకు సంబంధంలేని వాటి గురించి కూడా ఏదో ఆశిస్తాం. కారు కొనుకుంటే, ఫ్రెండ్స్‌ అందరూ పార్టీ ఇవ్వమని గొడవచేస్తారు. ఎందుకంటే ఈర్ష్య. ఎవరినీ పిలవకుండా గృహప్రవేశం, పెళ్లి, కనీసం బర్త్‌డే పార్టీ చేసుకున్నా మిమ్మల్ని చంపేస్తారు. ఈ అవినీతిని తగ్గించేందుకు ఒక మార్గం ఉంది. మార్కెట్‌కు వెళ్లడానికి లంచం అడిగే మీ పిల్లల్ని, ఇప్పుడే.. ఈరోజే అదుపు చేయండి. లేదు. ఊళ్లో అందరి కంటే మీ పిల్లలే రిచ్‌గా, లావుగా బొద్దుగా ఉండాలని కోరుకుంటే పానీ పూరికి డబ్బులిచ్చి పంపండి. చెంగు చెంగున ఎగురుకుంటూ వెళ్లిపోతారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని