అలా చేస్తే సినిమా ఫ్లాపవుతుంది: పూరి

జీవితంలో బాధ్యతలు మోసేవాళ్లకే చనిపోవాలన్న ఆలోచనలు వస్తాయని, కానీ, చనిపోవాల్సింది ఏ బాధ్యతలు లేనివాళ్లని దర్శకుడు పూరి

Published : 27 Oct 2020 19:27 IST

హైదరాబాద్‌: జీవితంలో బాధ్యతలు మోసేవాళ్లకే చనిపోవాలన్న ఆలోచనలు వస్తాయని, కానీ, చనిపోవాల్సింది ఏ బాధ్యతలు లేనివాళ్లని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. పూరి మ్యూజింగ్స్‌ పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘ఆత్మహత్య’ అంశంపై ఆయన మాట్లాడారు. చనిపోయేంత ధైర్యం ఉన్నవాడు నిజంగా హీరో అని, అయితే హీరోలు చనిపోతే సినిమా ఫ్లాప్‌ అవుతుందని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

‘‘లైఫ్‌లో ఎన్నో సార్లు మనమీద మనకు చిరాకొస్తుంది. ‘ఛీ వెధవ జీవితం చచ్చిపోవాలి’ అనిపిస్తుంది. మనలో చాలా మందికి ఇలాంటి ఆలోచన వచ్చే ఉంటుంది. ఇలా ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవాళ్లంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే తెలివైన వాళ్లకు మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఫూల్స్‌ ఎప్పుడూ ఇలా ఆలోచించరు. పిరికివాళ్లే ఆత్మహత్య చేసుకుంటారని అందరూ అంటారు. అది అసత్యం. చనిపోవడానికి ఎంతో ధైర్యం కావాలి. ప్రాణం వదిలేసే దమ్ము చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. జీవితంలో కొన్ని సమస్యల వల్ల చనిపోవాలన్న ఆలోచన వస్తుంది. అవి ఆర్థిక, కుటుంబ, ప్రేమ ఇలా ఏదైనా అందుకు కారణం కావచ్చు. బాధ్యతలు తీసుకున్న వాళ్లు మాత్రమే ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏ బాధ్యతలు లేకుండా బతికేవాళ్లకు ఇలాంటి ఆలోచనలే రావు. నిజంగా  చావాల్సింది వాళ్లు. నువ్వు కాదు’’

‘‘నీకు ప్రేమించే గుణం ఉంది.తప్పు చేయవు. ఎవరైనా మాట అంటే తట్టుకోలేవు. ఆత్మాభిమానం ఎక్కువ. పైగా నువ్వు తెలివైన వాడివి. పైగా నీకు చచ్చేంత దమ్ము ఉంది. ఇవన్నీ హీరో లక్షణాలు. నువ్వు హీరోవి. నువ్వు చావడమేంటి? నీలాంటి హీరోలే మాకు కావాలి. సినిమాల్లో ఇలాంటి హీరోని చూసే మేము విజిల్స్‌ వేస్తాం. అలాంటోడివి నువ్వు మా మధ్యలో ఉన్నావు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ‘ఈ జీవితానికో అర్థం లేకుండా పోయింది‌’ అని నీకు అనిపించవచ్చు. ఈ మనుషులు, వాళ్ల డ్రామాలు నీకు చిరాకు తెప్పించవచ్చు. కానీ, ఒక విషయం చెబుతా’’

‘‘ఏ సమస్య కోసమైతే నువ్వు చావాలనుకుంటున్నావో. ఆ సమస్యను పరిష్కరించు. నిన్ను నమ్ముకున్న వాళ్లకు న్యాయం చెయ్‌. ఆ సమస్య పరిష్కరించి, అప్పటికీ చావాలనిపిస్తే అప్పుడు చావు. కానీ, ఒక చిన్న సమస్య కోసం నా హీరో చచ్చిపోవడం నేను తట్టుకోలేను. జీవితమనే సినిమా ఫ్లాఫ్‌ అయిపోతుంది. నిన్ను ఇబ్బంది పెడుతున్న వాళ్లని చావగొట్టు. ప్రేమించి మోసం చేశారా? అందుకు వాళ్లు అర్హులు కాదని గుర్తించు. నువ్వు నాకు కావాలి. నాకన్నా ముందు నువ్వు పోనవసరం లేదు. నీకు నాకూ మధ్య పెద్ద గ్యాప్‌ కూడా లేదు. మహా అయితే రెండు రోజులు. అందరం కలిసే పోదాం. గుర్తు పెట్టుకో.. చావడానికి సిద్ధంగా ఉన్నవాడిని ఎవ్వడూ చంపలేడు. మనందరం లైఫ్‌లో చావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ, చావద్దు’’ అని పూరి జగన్నాథ్‌ చెప్పుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని