Radheshyam: ఇటలీని హైదరాబాద్‌లో ఆవిష్కరించాం

‘‘గోడపై కనిపించే ఓ చిన్న ఫ్రేమ్‌ అయినా కథలోని భావోద్వేగాన్ని ప్రతిబింబించేలా ఉండాలి... నా దృష్టిలో అదే కళ’’ అంటారు ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌. ‘మగధీర’, ‘ఈగ’తోపాటు... గుర్తుండిపోయే

Updated : 06 Mar 2022 13:06 IST

‘‘గోడపై కనిపించే ఓ చిన్న ఫ్రేమ్‌ అయినా కథలోని భావోద్వేగాన్ని ప్రతిబింబించేలా ఉండాలి... నా దృష్టిలో అదే కళ’’ అంటారు ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌. ‘మగధీర’, ‘ఈగ’తోపాటు... గుర్తుండిపోయే ఎన్నో చిత్రాలకి తన కళానైపుణ్యంతో ఆయువు పోశారీయన. ఇటీవల ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్‌’  సినిమాకీ ఆయనే ప్రొడక్షన్‌  డిజైనర్‌. ఈ చిత్రం కోసం ఇటలీ నేపథ్యాన్ని హైదరాబాద్‌లో సృష్టించారు రవీందర్‌. ‘రాధేశ్యామ్‌’ ఈనెల 11న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఆ సినిమా కోసం చేసిన ప్రయాణం గురించి ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

‘‘పీరియాడిక్‌ సినిమాలు చేయడం మనకు కొత్తేమీ కాదు. పురాణాలు, జానపద కథలు మొదలుకొని మనం అలాంటివి ఎన్నో చేస్తుంటాం. వేరే దేశం పీరియడ్‌ని మన దేశంలో చేయడమనేది ఇదే తొలిసారి. మదర్‌ ఆఫ్‌ ఆర్ట్‌గా భావించే రోమా నగరాన్ని ప్రతిబింబించే వాతావరణాన్ని ‘రాధేశ్యామ్‌’ కోసం సృష్టించడం ఓ గొప్ప అనుభూతిని, అనుభవాన్నిచ్చింది. దర్శకుడు ఈ సినిమా కథ చెప్పగానే చాలా నచ్చింది. ఆ తర్వాత 1970 నేపథ్యంలో చేద్దామన్నప్పుడు ఇంకా ఆత్రుతగా అనిపించింది. విదేశీ నేపథ్యమనే సరికి మరింత ఛాలెంజింగ్‌గా తీసుకున్నా. ఏ దేశం అనే ఆలోచన మొదలైనప్పుడు ఇటలీ అని చెప్పారు. కళకి పెట్టింది పేరు ఇటలీ. గొప్ప కళా సంస్కృతికి, నిర్మాణాకృతులకి, చిత్రకళకి పెట్టింది పేరు ఐరోపా దేశాలు. లోతుగా ఏం చూపిస్తామనే ఆలోచనతో అక్కడికి వెళ్లి చేసిన    సినిమానే ‘రాధేశ్యామ్‌’.

రామోజీ ఫిల్మ్‌సిటీనే సరి...

‘‘ఈ సినిమాకోసం ఇళ్లే కాదు... రెండు మూడు రైళ్లు, ఆస్పత్రులు ఇలా చాలానే సృష్టించాం. ఏదీ సెట్‌లాగా అనిపించదు. అన్నీ ఒకెత్తైతే, పతాక సన్నివేశాల్లో వచ్చే నౌక నిర్మాణం మరో ఎత్తు. నౌకని ఎలా చేస్తాం? అసలు చేయగలమా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. నాకైతే నమ్మకం ఉండేది. అయితే ఇలాంటి సెట్స్‌ వేయడానికని కొన్ని దేశాల్లో నీళ్లు, పెద్ద పెద్ద ఫ్లోరతో కూడిన ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి ఏర్పాట్లు బల్గేరియాలో ఉన్నాయని తెలిసింది. అక్కడే కాదు, రామోజీ ఫిల్మ్‌సిటీలోనూ అలాంటి సెట్స్‌ వేయొచ్చని నాకు అనిపించింది. అందుకు తగ్గ సాంకేతికత, సదుపాయాలు అక్కడ ఉన్నాయి. నాలుగు ఫ్లోర్లు తీసుకుని, 432 అడుగుల నౌక సెట్‌ వేశాం. ఆ ఎపిసోడ్‌ మొత్తం రామోజీ ఫిల్మ్‌సిటీలోనే జరిగింది. అక్కడి ఫ్లోర్లలో నీళ్లతో కూడిన సెట్స్‌, అందులో నౌక, కాబిన్స్‌, హైడ్రాలిక్‌ సిస్టమ్స్‌... ఆ వాతావరణం మొత్తం ఓ హాలీవుడ్‌ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్టే ఉండేది. ఇలాంటి ఎపిసోడ్స్‌కి రామోజీ ఫిల్మ్‌సిటీనే సరైందని అప్పుడనిపించింది. దర్శకుడు అనుకున్న కథ, అందులోని భావోద్వేగం చెడకుండానే... ఆ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లేలా నా పనితీరు ఉండాలనుకుంటా. మనం ఎంత గొప్పగా ఆలోచిస్తే సినిమా అంత గొప్పగా వస్తుందని నేను నమ్ముతాను’’.

ఏడాదిపాటు అక్కడే...

‘‘వాటికన్‌ సిటీకి వెళ్లే దారిలోనే రోమా నగరం ఉంటుంది. మదర్‌ ఆఫ్‌ ఆర్ట్‌గా పిలుస్తారు ఆ నగరాన్ని. అక్కడ మేం ఒక ఏడాదిపాటు ఉన్నాం. 16 మందితో కూడిన మా బృందం, 20 మంది ఇటాలియన్‌ బృందం కలిసి ఈ సినిమా లొకేషన్ల కోసం రెక్కీ చేశాం. వాళ్లు ప్రతి చిన్న వస్తువునీ జాగ్రత్తగా చూసుకుంటారు. పాత వస్తువు కదా? అని మనలాగా వదిలేయరు.  ఇటలీలో ఏ ఇంటికి వెళ్లినా ఇది 700 ఏళ్ల ఇల్లు. 2 వేల ఏళ్ల కిందట కట్టిన నిర్మాణం అని చెప్పేవాళ్లు. కొన్నిచోట్లేమో అత్యాధునిక ప్రపంచం కనిపించేది. 1970కి దగ్గరగా ఉన్న వాతావరణం కనిపించేది కాదు. అప్పుడు మా బృందం ప్రత్యేకంగా పరిశోధన చేసి, మా కథ సాగే ఆ కాలాన్ని పోలిన వస్తువుల్ని కనిపెట్టి, ఆ తరహా నిర్మాణాల్ని తీర్చిదిద్ది చిత్రీకరణ చేశాం’’.

భరోసా వచ్చింది

‘‘కరోనా ఉద్ధృతి వల్ల ఇటలీలో చిత్రీకరణ చేయలేని పరిస్థితి. అందుకే మేం ఇటలీని హైదరాబాద్‌కి తీసుకు రావాలని నిర్ణయించాం. హీరోయిన్‌ ఇల్లు చూశాక ఇక మనం ఇటలీని ఇక్కడే సృష్టించగలం అనే భరోసా మా బృందానికి వచ్చింది. ప్రభాస్‌ మొదలుకొని... అందరూ మెచ్చుకున్నారు’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని