Abhiram Daggubati: అభిరామ్‌ ‘అహింస’

కొత్త నటుల్ని తెరకు పరిచయం చేయడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు తేజ. కొత్త   తరంతో కలిసి ఎన్నో  విజయాల్ని సొంతం చేసుకున్నారాయన. ఈసారి  డి.రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ దగ్గుబాటిని పరిచయం చేస్తున్నారు.

Updated : 23 Feb 2022 08:08 IST

కొత్త నటుల్ని తెరకు పరిచయం చేయడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు తేజ. కొత్త   తరంతో కలిసి ఎన్నో  విజయాల్ని సొంతం చేసుకున్నారాయన. ఈసారి  డి.రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ దగ్గుబాటిని పరిచయం చేస్తున్నారు. తేజ - అభిరామ్‌ కలయికలోని సినిమాని ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్‌ నిర్మిస్తున్నారు. దర్శకుడు తేజ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఈ సినిమా పేరుని ప్రకటించడంతోపాటు, ప్రి లుక్‌ని   విడుదల చేశారు. ‘అహింస’ అనే పేరుని ఖరారు చేసినట్టు తెలిపింది చిత్రబృందం. రక్తం కారుతున్న ముఖంతో ఉన్న ప్రి లుక్‌ని విడుదల చేశారు. ఆర్‌.పి.పట్నాయక్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, పాటలు: చంద్రబోస్‌, పోరాటాలు: రియల్‌ సతీష్‌.

‘విక్రమాదిత్య’ మొదలు

‘అహింస’ చిత్రీకరణని పూర్తి చేసిన తేజ... ‘విక్రమాదిత్య’ ఓ ప్రేమకథని తెరకెక్కిస్తున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రం 1836వ సంవత్సరంలో సాగే కథతో తెరకెక్కనుంది. ఆ సమయంలోనే సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ ధవళేశ్వరం బ్యారేజీని నిర్మించారనీ, ఈ కథకీ... ఆ వంతెనకీ సంబంధం ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. మంగళవారమే చిత్రీకరణని ప్రారంభించారు. తేజ దర్శకత్వం వహించిన ‘జయం’ చిత్రీకరణ సరిగ్గా 20 ఏళ్ల కిందట ఇదే సమయంలో మొదలైందని, ‘విక్రమాదిత్య’ ఆయన కలల ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతుందని ఈ సినీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని