నటి ఫిర్యాదు.. అనురాగ్‌ కశ్యప్‌పై కేసు నమోదు

అనురాగ్‌ కశ్యప్‌పై ముంబయి పోలీసులు రేప్‌ కేసు..

Updated : 23 Sep 2020 21:33 IST

ముంబయి: బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై ముంబయి పోలీసులు రేప్‌ కేసు నమోదు చేశారు. శనివారం ఓ ట్వీట్‌లో తనను బలవంతం చేశాడంటూ ఆరోపించిన నటి మంగళవారం రాత్రి లాయర్‌తో కలిసివెళ్లి వెర్సోవా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా దర్శకుడు, నిర్మాతపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2013లో వెర్సోవాలోని యారి ప్రాంతంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డట్లు నటి ఫిర్యాదులో పేర్కొంది. కాగా విచారణకు హాజరు కావాల్సిందిగా త్వరలోనే కశ్యప్‌కు నోటీసులు జారీచేయనున్నట్లు ఓ పోలీసు అధికారి న్యూస్‌ ఏజెన్సీ పీటీఐకి వెల్లడించారు. సదరు నటి శనివారం ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్‌ చేస్తూ అనురాగ్‌ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అతడిని అరెస్టు చేయాలంటూ ట్వీట్‌ చేసింది. దీనిపై స్పందించిన జాతీయ కమిషన్‌ మహిళా చీఫ్ రేఖా శర్మ పూర్తి వివరాలతో  ఫిర్యాదు చేయాల్సిందిగా సదరు నటిని కోరారు.

నటి ట్వీట్‌పై స్పందించిన అనురాగ్ కశ్యప్‌ ఆమె ఆరోపణలను ఖండించాడు. అవన్నీ నిరాధారమైనవిగా పేర్కొంటూ పలు ట్వీట్లు చేశాడు. తప్పుడు ఆరోపణలతో తీవ్రంగా కలతచెందానని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా తన లాయర్‌తో కలిసి ముందుకెళతానని అన్నాడు. కాగా ఆ నటికి కంగనా రనౌత్‌ మద్దతు తెలిపి అనురాగ్‌ కశ్యప్‌ను అరెస్టు చేయాల్సిందిగా కోరింది. పలువురు నటీమణులు కశ్యప్‌కు మద్దతుగా నిలిచారు. నటి, కశ్యప్‌ మాజీ భార్య కల్కి కొచ్లిన్‌, తాప్సి, హ్యూమా ఖురేషి అతడు మహిళలను ఎంతో గౌరవిస్తాడని, అలాంటి తప్పు చేసేవాడు కాదంటూ మద్దతు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని