వాటి నుంచి నన్ను కాపాడండి: రియా

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పలు మీడియా కథనాలు తనని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నాయని...

Updated : 10 Aug 2020 23:57 IST

దిల్లీ/ముంబయి: సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పలు మీడియా కథనాలు తనని దోషిగా చూపే ప్రయత్నాలు చేస్తున్నాయని, వాటి వల్ల తన వ్యక్తిగత భద్రతకు భంగం కలుగుతోందని, అటువంటి కథనాల నుంచి తనని కాపాడాలని కోర్టును అభ్యర్థించారు. అలానే రాజకీయ అజెండాలో తాను బలిపశువు అవుతానేమోనని భయపడుతున్నట్లు అందులో వెల్లడించారు.

గత నెల రోజుల్లో నటులు అశుతోష్ భాక్రే, సమీర్‌ శర్మ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారనీ, వారి మరణాల గురించి ఎలాంటి ప్రచారాలు రాలేదని అన్నారు. కానీ సుశాంత్ కేసులో మాత్రం తనను దోషిగా చూపిస్తూ మీడియా కథనాలు వెలువడుతున్నాయనీ రియా పిటిషన్‌లో పేర్కొన్నారు. అలానే పట్నాలో తనపై నమోదైన కేసుకు బిహార్‌ సీఎం నితీశ్ కుమార్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. అలానే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు విచారించడాన్ని ఆమె తప్పుబట్టారు. మహారాష్ట్రలో ఘటన జరిగితే, ఆ కేసు విచారణకు బిహార్‌ ముఖ్యమంత్రి సీబీఐని ఎలా ఆహ్వానిస్తారని ఆమె ప్రశ్నించారు. పట్నాలో తన మీద నమోదైన కేసును ముంబయికి మార్చాలని కోరుతూ రియా గతంలో ఒకసారి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా మీడియా సంస్థలపై ఆరోపణలు చేస్తూ ఆమె సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

సుశాంత్ ఆత్మహత్యకు రియా చక్రవర్తి, ఆమె కుటుంబసభ్యులేనని ఆరోపిస్తూ ఆయన తండ్రి పట్నా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అలానే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. పట్నాలో నమోదైన కేసు ఆధారంగా సీబీఐ రియాతో పాటు మరో ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. మరోవైపు ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఇప్పటికే రియా చక్రవర్తితో పాటు పలువురిని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం మరోమారు ఆమె ఈడీ ముందు హాజరయ్యారు.

దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ

దిల్లీ: మనీ ల్యాండరింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి సోమవారం ఉదయం మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట దర్యాప్తునకు హాజరైంది. తన సోదరుడు షోవిక్‌తో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చింది. నటుడు సుశాంత్‌సింగ్‌ తండ్రి ఫిర్యాదు మేరకు బిహార్‌ పోలీసులు కేసు నమోదు చేయగా ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది. శనివారం రియాను 8 గంటల పాటు విచారించిన ఈడీ, ఆమె సోదరుడు షోవిక్‌ను 18 గంటలపాటు ప్రశ్నించడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని