తొలి జేమ్స్‌బాండ్‌ హీరో సీన్‌ కానరీ ఇకలేరు

స్కాటిష్‌ నటుడు, జేమ్స్‌బాండ్‌ తొలి పాత్రధారి సర్‌ థామస్‌ సీన్‌ కానరీ కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో

Updated : 31 Oct 2020 19:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్కాటిష్‌ నటుడు, జేమ్స్‌బాండ్‌ తొలి పాత్రధారి సర్‌ థామస్‌ సీన్‌ కానరీ కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన ఆయన ఆస్కార్‌ పురస్కారం సహా ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో 90వ పుట్టిన రోజు జరుపుకొన్న ఆయన మూడు నెలలు తిరగకుండానే కన్నుమూయడంతో హాలీవుడ్‌ పరిశ్రమ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు విచారంలో మునిగిపోయారు.

భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులు కలిగిన పాత్ర జేమ్స్‌ బాండ్‌. ‘బాండ్‌.. జేమ్స్‌ బాండ్‌’ అంటూ తొలిసారి ఆ పాత్రలో కథానాయకుడిగా నటించి మెప్పించారు సీన్‌ కానరీ. మొత్తం ఆరు చిత్రాల్లో ఆయన జేమ్స్‌ బాండ్‌గా దర్శనమిచ్చారు. ‘డాక్టర్‌ నో’, ‘ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్‌’, ‘గోల్డ్‌ ఫింగర్‌’, ‘థండర్‌ బాల్‌’, ‘యు ఓన్లీ లివ్‌ ట్వైస్‌’, ‘డైమండ్స్‌ ఆర్‌ ఫరెవర్‌’ చిత్రాల్లో నటించి మెప్పించారు. ‘ది అన్‌ టచ్‌బుల్స్‌’ చిత్రంలో నటనకి గాను ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు. 1989 సంవత్సరంలో పీపుల్‌ మ్యాగజైన్‌ ఆయనను ‘సెక్సియస్ట్‌ మ్యాన్‌ ఎలైవ్‌’గా, 1999లో ‘సెక్సియస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సెంచరీ’గా ప్రశంసించింది. 2006లో అమెరికన్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సీన్‌ కానరీ ఆ తర్వాత నట జీవితం నుంచి విశ్రాంతి తీసుకున్నారు. అయితే, 2012లో ‘సర్‌ బిల్లీ’ చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ అందించారు.

‘మార్నీ’, ‘ద నేమ్‌ ఆప్‌ ద రోజ్‌’, ‘ద లీగ్‌ ఆఫ్‌ ద ఎక్స్‌ట్రార్డినరీ జెంటిల్‌మెన్‌’ ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ద లాస్ట్‌ క్రుసేడ్‌’, ‘ద హంట్‌ ఫర్‌ రెడ్‌ అక్టోబర్‌’, ‘డ్రాగన్‌ హార్ట్‌’, ‘దరాక్‌’ లాంటి చిత్రాల ద్వారా సీన్‌ కానరీ అలరించారు. 1930 ఆగస్టు 25న స్కాట్‌లాండ్‌లో పుట్టిన సీన్‌కానరీ తల్లి ఒక క్లీనింగ్‌ ఉమెన్‌ కాగా, తండ్రి లారీ డ్రైవర్‌. 18 ఏళ్ల వయసులో మిల్క్‌మాన్‌గా పనిచేసి రాయల్‌నేవీలో చేరారు. అనారోగ్య కారణాల వల్ల నేవీ నుంచి బయటకి వచ్చాక లారీడ్రైవర్‌గా, కార్మికుడిగా కొన్ని పనులు చేశారు. అదనపు ఆదాయం కోసం నాటకాలలో పాత్రలు పోషిస్తుంటే సినిమా ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి వెళ్లారు. అలా ‘సౌత్‌ పసిఫిక్‌’ (1954) సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు. ఆదాయం కోసం చిన్న చిన్న వేషాలు వేస్తూనే టీవీల్లో కూడా నటించేవారు. 1962లో జేమ్స్‌బాండ్‌ పాత్రకు అవకాశం వచ్చింది. అలా ‘డాక్టర్‌ నో’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత సీన్‌ కానరీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని