సుశాంత్‌ లాగే మీరూ జరుపుకోవాలి

తన సోదరుడు సుశాంత్‌సింగ్‌ మాదిరే మీరు కూడా ప్రేమను పంచుతూ అందరి హృదయాల్లో నిలవాలని సుశాంత్‌ సోదరి శ్వేతాసింగ్‌ కీర్తి నటుడి అభిమానులను కోరారు...

Updated : 15 Nov 2020 07:31 IST

అభిమానులను కోరిన నటుడి సోదరి

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన సోదరుడు సుశాంత్‌సింగ్‌ మాదిరే మీరు కూడా ప్రేమను పంచుతూ అందరి హృదయాల్లో నిలవాలని సుశాంత్‌ సోదరి శ్వేతాసింగ్‌ కీర్తి నటుడి అభిమానులను కోరారు. దిపావళి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. ‘అందరికి ప్రేమను పంచుదాం. వారి హృదయాల్లో నమ్మకాన్ని పెంచుదాం. సుశాంత్‌లాగే ఈ పండగను జరుపుకొందాం’ అని ట్విటర్‌ ద్వారా కోరారు. సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్న తన సోదరుడి ఫొటోను ఈ సందర్భంగా పంచుకున్నారు. ‘సుశాంత్‌ ప్రతిఒక్కరికి ప్రేమను పంచేందుకు ఇష్టపడేవాడు. అతడు చేసినట్లే దివాళి పర్వదినాన కొన్ని మంచి పనులు చేద్దాం. దీపాలు, క్యాండిళ్లను చిరు దుకాణదారుల వద్దే కొనుక్కుందాం. ఇలా చేస్తే వారు కూడా ఈ పండగను సంతోషంగా జరుపుకొంటారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొని మానవత్వం బతికుండేలా చూద్దాం’ అంటూ నటుడి ఫొటో పక్కన రాసుకొచ్చారు.

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా ఈ కేసును ముంబయి పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రస్తుతం ఈ కేసును మూడు దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. సీబీఐ విచారణలో మాదకద్రవ్యాల వినియోగం బయటపడటంతో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగింది. ఇప్పటికే పలువురిని విచారించింది. మరికొందరిని అరెస్టు చేసింది. సుశాంత్‌ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు బదిలీ చేసుకున్నారు అని వచ్చిన ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు జరుపుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని