‘నన్ను చంపేస్తారు’ అని సుశాంత్‌ అనేవాడు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానస్పద మృతి కేసు విచారణలో ఎన్నో కొత్తవిషయాలు బయటకు వస్తున్నాయి. మానసిక కుంగుబాటుతో సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని మొదట భావించినప్పటికీ ప్రస్తుతం ఆ కేసును ఎన్‌సీబీతోపాటు సీబీఐ బృందాలు డ్రగ్స్‌ కోణంలో విచారిస్తున్నారు..

Published : 17 Sep 2020 11:33 IST

దిశా మృతితో హీరో భయాందోళనకు గురయ్యాడు: సిద్దార్థ్‌ పితానీ
 

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానస్పద మృతి కేసు విచారణలో ఎన్నో కొత్తవిషయాలు బయటకు వస్తున్నాయి. మానసిక కుంగుబాటుతో సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని మొదట భావించినప్పటికీ ప్రస్తుతం ఆ కేసును ఎన్‌సీబీతోపాటు సీబీఐ బృందాలు విచారిస్తున్నాయి. దీంతో సుశాంత్‌ జీవితానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సుశాంత్‌ స్నేహితుడు సిద్దార్థ్‌ పితానీని సీబీఐ ప్రశ్నించింది. విచారణలో భాగంగా సిద్దార్థ్‌.. సుశాంత్‌ మృతి చెందడానికి కొన్నిరోజుల ముందు ఏం జరిగిందో వెల్లడించినట్లు సమాచారం.

సుశాంత్‌ మృతి చెందడానికి కొన్నిరోజుల ముందు ఆయన మాజీ మేనేజర్‌ దిశా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే, దిశా మృతి తర్వాత సుశాంత్‌ ఎంతో భయాందోళనలకు గురయ్యాడని, ‘నన్ను చంపేస్తారు’ అని సుశాంత్‌ తరచూ తనకి చెప్పి కంగారుపడేవాడని వెల్లడించాడు. దీంతో పాటు సెక్యూరిటీని కూడా పెంచుకోవాలనుకున్నాడని సిద్దార్థ్‌ సీబీఐ ఎదుట చెప్పినట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. రియా గురించి సిద్దార్థ్‌ పలు ఆసక్తికర విషయాలను విచారణలో తెలియచేశారట. సుశాంత్‌ ల్యాప్‌టాప్‌, హార్డ్‌డ్రైవ్‌ను రియా చక్రవర్తి తీసుకువెళ్లిందని సిద్దార్థ్‌ సీబీఐకి వెల్లడించినట్లు తెలుస్తోంది.

సుశాంత్‌ది హత్య: మాజీ మేనేజర్‌

సుశాంత్‌ది ఆత్మహత్య కాదని.. హత్య అని నటుడి మాజీ మేనేజర్‌ అంకిత్‌ ఆచార్య ఎన్‌సీబీకి తెలిపినట్లు సమాచారం. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కేసును డ్రగ్స్‌ కోణంలో విచారణ చేస్తున్న ఎన్‌సీబీ నటుడితో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కర్నీ విచారిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా హీరో మాజీ మేనేజర్‌ అంకిత్‌ను విచారణ చేసింది. ‘సుశాంత్‌ మృతి చెందిన నాటి నుంచి నేను చెబుతున్నది ఒక్కటే. ఇది ఆత్మహత్య కాదు హత్య. సుశాంత్‌ ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదు. మాదకద్రవ్యాలకు బానిస అయితే కలలను సాకారం చేసుకోలేడనే విషయం సుశాంత్‌కి బాగా తెలుసు’ అని అంకిత్‌ తెలిపినట్లు ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని