మన కథానాయికల నేపథ్యమేంటో తెలుసా?

అనుష్క.. పశుపతిని అంతం చేసిన జేజమ్మ.. కాజల్‌.. జోగేంద్ర కోసం ప్రాణత్యాగం చేసిన రాధ.. తమన్నా.. మహారాణి దేవసేనను చెర నుంచి తప్పించేందుకు పోరాడిన అవంతిక.. సమంత.. గట్టోడు చిట్టిబాబును ప్రేమలో పడేసిన రామలక్ష్మి.. ....

Updated : 28 Sep 2020 17:19 IST

అనుష్క.. పశుపతిని అంతం చేసిన జేజమ్మ..

కాజల్‌.. జోగేంద్ర కోసం ప్రాణత్యాగం చేసిన రాధ..

తమన్నా.. మహారాణి దేవసేనను చెర నుంచి తప్పించేందుకు పోరాడిన అవంతిక..

సమంత.. చిట్టిబాబును ప్రేమలో పడేసిన రామలక్ష్మి.. 

నయనతార.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉద్యమానికి అడ్డుకాకూడదని ఆయనకు దూరమైన సిద్ధమ్మ..

అందం, అభినయంతో ఈ భామలు నేడు అగ్ర నటీమణులుగా వెలుగొందుతున్నారు సరే.. మరి ఆరంభంలో సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలో ఎలా అడుగుపెట్టారు? అవకాశం వీరిని ఎలా వరించింది? వారి కుటుంబం నేపథ్యం ఏంటి?..

నుష్క కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. ఆమె మాతృభాష తుళు. అసలు పేరు స్వీటీ శెట్టి. మంగళూరులోనే చదువుకున్నారు. ప్రఫుల్లా, ఎ.ఎన్‌ విఠల్‌ శెట్టి తల్లిదండ్రులు. స్వీటీకి ఇద్దరు సోదరులు. వీరిది వైద్య వృత్తి. చదువు పూర్తయ్యాక అనుష్క యోగా టీచర్‌గా పనిచేశారు. సినిమా ప్రపంచంతో సంబంధం లేని ఈ కుటుంబంలో నుంచి తొలిసారి అనుష్క వెండితెరపైకి వచ్చారు. అనుకోకుండా పూరీ జగన్నాథ్‌ సినిమా ‘సూపర్‌’లో అవకాశం దక్కించుకున్నారు. సినిమాల కోసం అనుష్కగా పేరు మార్చుకున్నారు. ఆపై అందరూ మెచ్చిన తారయ్యారు. అక్టోబరు 2న ఆమె ‘నిశ్శబ్దం’ సినిమా రాబోతోంది.

బెంగళూరులో నయనతార జన్మించారు. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్‌. తల్లిదండ్రులు కురియన్‌ కొడియట్టు, ఓమన్‌ కురియన్‌. వీరి స్వస్థలం కేరళ. నయన్‌ తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. దీంతో నయన్‌ బాల్యం ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాల్లో గడిచింది. కళాశాలలో చదువుతున్న రోజుల్లో నయన్‌ మోడలింగ్‌ చేశారు. ఆ క్రమంలో ఓ దర్శకుడు ఆమెను గుర్తించడంతో, సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆపై అనేక చిత్రాల్లో అలరించి.. లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నారు.

శ్రియ హరిద్వార్‌లో పుట్టి, పెరిగారు. ఆమె తండ్రి శరణ్‌ భట్నాగర్‌ భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో పనిచేసేవారు, తల్లి నీరజ కెమిస్ట్రీ టీచర్‌. చిన్నతనం నుంచి డ్యాన్స్‌పై ఇష్టం పెంచుకున్న శ్రియ.. శిక్షణ తీసుకున్నారు. ఈ క్రమంలో ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌లో నటించే అవకాశం వచ్చింది. దాని ద్వారా తెలుగు సినిమాలో ఆఫర్‌ వచ్చింది. అలా ‘ఇష్టం’తో పరిచయమై.. ‘సంతోషం’తో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె తన భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లో ఉంటున్నారు. సినిమా షూటింగ్‌ల కోసం భారత్‌ వచ్చి, వెళ్తున్నారు. శ్రియ అన్నయ్య అభిరూప్‌ ముంబయిలో జీవిస్తున్నారు.

మంత తండ్రి ప్రభు తెలుగు వారు. ఆమె తల్లి నినెట్‌ది కేరళ. సామ్‌ చెన్నైలోని పల్లవరంలో పెరిగారు. కుటుంబంలో ఆమే చిన్న కుమార్తె. ఇద్దరు అన్నయ్యలు జోనాథన్‌, డేవిడ్‌ ఉన్నారు. చిన్నతనం నుంచి సామ్‌ తమిళ అమ్మాయిలానే పెరిగారు. చెన్నైలో విద్య అభ్యసించారు. ఆమె డిగ్రీ చేస్తున్న రోజుల్లో మోడలింగ్‌ చేశారు. ఆ సమయంలో ఫిల్మ్‌ మేకర్‌ రవి వర్మన్‌ చూసి.. తను తీయబోయే తమిళ సినిమా ‘మాస్కోవిన్ కావేరి’లో కథానాయికగా తొలి అవకాశం ఇచ్చారు. కానీ ఆ ప్రాజెక్టు కంటే ముందే ‘ఏ మాయ చేసావె’ విడుదలై.. హిట్‌ అందుకుంది. ఆపై సామ్‌ తన నటనతో చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగారు. నాగచైతన్యతో ప్రేమ వివాహం తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఇటీవల ఓ పాఠశాలను ఆరంభించారు. ‘సాకీ’ అనే దుస్తుల బ్రాండ్‌ను కూడా స్థాపించారు. త్వరలో దీన్ని ఆరంభించబోతున్నారు.

కాజల్‌ పంజాబీ కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి వినయ్‌ అగర్వాల్‌ వస్త్ర వ్యాపారం చేసేవారు. వీరి కుటుంబం ముంబయిలో స్థిరపడింది. కాజల్‌ అక్కడే విద్యనభ్యసించారు. ఐశ్వర్యరాయ్‌ నటించిన ‘క్యూ.. హో గయానా’ అనే హిందీ చిత్రంతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన కాజల్‌.. ‘లక్ష్మీ కల్యాణం’తో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అనేక సినిమాలతో స్టార్‌గా ఎదిగారు. ఆమె సోదరి నిషా అగర్వాల్‌ కూడా నటిగా రాణించారు. ఇప్పుడు కాజల్‌ చేతిలో ‘ఆచార్య’, ‘మోసగాళ్లు’, ‘భారతీయుడు 2’ తదితర చిత్రాలున్నాయి.

మిల్కీబ్యూటీగా దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ రాణిస్తున్న తమన్నా ముంబయిలో జన్మించారు. ఆమె తండ్రి సంతోష్‌ వజ్రాల వ్యాపారి. తల్లి రజని గృహిణి. ముంబయిలో చదువుతున్న రోజుల్లో తమన్నా పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో తన అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ సమయంలో ఆమెకు నటించే అవకాశం వచ్చింది. 2005లో ‘శ్రీ’తో తెలుగు వారికి పరిచయమయ్యారు. వరుస సినిమాలతో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ‘సీటీమార్‌’లో గోపీచంద్‌ సరసన నటిస్తున్నారు.

బుట్టబొమ్మ పూజా హెగ్డే ముంబయిలో పుట్టి, పెరిగినప్పటికీ ఆమె స్వస్థలం మంగళూరు. తల్లిదండ్రులు లతా హెగ్డే, మంజునాథ్‌ హెగ్డే.  పూజ ఎమ్‌.ఎమ్‌.కె. కళాశాలలో చదివారు. అప్పుడే ఫ్యాషన్‌, డ్యాన్స్‌ షోలలో చురుకుగా పాల్గొనేవారు. 2009 మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు.  2012లో ‘మూగమూడి’ అనే తమిళ సినిమాతో నటిగా అరంగేట్రం చేశారు. 2014లో ‘ఒకలైలా కోసం..’, ‘ముకుంద’ సినిమాలతో తెలుగు వారిని అలరించారు. ఇప్పుడు టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు.

ర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేటలో జన్మించారు రష్మిక. అక్కడి స్థానిక పాఠశాలలోనే చదువుకున్నారు. రామయ్య కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలోనే మోడలింగ్‌లో మెళకువలు నేర్చుకుని, పలు ప్రకటనల్లో నటించారు. 2012లో ‘క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఫ్రెష్‌ ఫేస్‌ ఆఫ్‌ ఇండియా’ టైటిల్‌ సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో ఆమెను చూసిన ‘కిర్రిక్‌ పార్టీ’ దర్శక, నిర్మాతలు ఆ సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా ఆమె నటిగా కెరీర్‌ ఆరంభించారు. తెలుగులో ‘ఛలో’, ‘గీతా గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ , ‘భీష్మ’ సినిమాలతో అలరించారు. ‘పుష్ప’లో నటిస్తున్నారు.

‘ఫిదా’ భామ సాయిపల్లవి తమిళనాడులోని కోటగిరిలో జన్మించారు. రాధ, సెంతమరై కన్నన్ తల్లిదండ్రులు. తండ్రి పోలీసు అధికారి. సాయిపల్లవి కోయంబత్తూర్‌లో చదువుకున్నారు, అక్కడే పెరిగారు. ఇప్పుడు డాక్టర్‌ కోర్సు చేస్తున్నారు. డ్యాన్స్‌పై ఇష్టంతో చిన్నతనంలోనే అనేక షోలలో పాల్గొన్నారు. ‘ఢీ4’లో పాల్గొని, ఫైనల్‌కు వెళ్లారు. కానీ సాయిపల్లవి ప్రత్యేకంగా ఎవరి దగ్గర శిక్షణ తీసుకోలేదట. 2014లో ఆమె జార్జియాలో చదువుతున్న రోజుల్లో దర్శకుడు ఆల్ఫోన్స్‌ పుతారెన్‌ ‘ప్రేమమ్‌’లో అవకాశం ఇచ్చారు. ఆపై ‘ఫిదా’ నుంచి ఆమె తెలుగు ప్రయాణం మొదలైంది. త్వరలో ఆమె నటిస్తున్న ‘లవ్‌ స్టోరీ’ విడుదల కాబోతోంది.

రాశీ ఖన్నా దిల్లీలో పుట్టి, పెరిగారు. అక్కడే పాఠశాల, కళాశాల చదువులు పూర్తి చేశారు. చిన్నతనంలో గాయని కావాలి అనుకున్నారట. కానీ పెద్దయ్యే కొద్దీ చదువుపై ఆసక్తి పెరిగి, ఐఏఎస్‌ కావాలని కలలు కన్నట్లు ఓసారి చెప్పారు. చదువు పూర్తయ్యాక ప్రకటనలకు కాపీ రైటర్‌గా పనిచేశారు. తరువాత ప్రకటనల్లో నటించారు. ఈ క్రమంలో 2013లో హిందీ చిత్రం ‘మద్రాస్‌ కేఫ్‌’లో అవకాశం వచ్చింది. ఆ మరుసటి ఏడాది ‘ఊహలు గుసగుసలాడే’తో కథానాయికగా తెలుగువారికి పరిచయం అయ్యారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని