ఆత్మహత్యకు ముందురోజు సుశాంత్‌ ఏం చేశాడంటే..

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్‌కు శునకాలంటే ఎంతో ఇష్టం ఉండేది..

Updated : 06 Sep 2020 17:43 IST

పలు విషయాలు వెల్లడించిన ఫామ్‌హౌజ్‌ నిర్వాహకుడు

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్‌కు శునకాలంటే ఎంతో ఇష్టం ఉండేది. వీలు చిక్కినప్పుడల్లా తన పెంపుడు శునకాలతో కాలక్షేపం చేస్తుండేవాడు. తనువు చాలించాలనుకునే సమయంలోనూ వాటి బాగోగుల గురించి ఆలోచించాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందురోజు తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు శునకాల పోషణకు డబ్బు బదిలీ చేశాడు. లోనావాలాలోని ఫామ్‌హౌజ్‌లో ఉన్న పెంపుడు కుక్కలు అమర్‌, అక్బర్‌, ఆంటొనీలకు సపర్యలు చేస్తున్న సంరక్షకుడు రాయీస్‌కు నగదు బదిలీ చేశాడు. ఈ విషయాన్ని రాయీస్‌ స్వయంగా వెల్లడించాడు. ‘జూన్‌ 14న సుశాంత్‌ సర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు టీవీలో వస్తున్న వార్తలను చూసి నమ్మలేకపోయాను. పెంపుడు కుక్కలకు అవసరమయ్యే డబ్బును అంతకు ముందురోజే నా ఖాతాలో జమచేశారు’ అని గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఫామ్‌హౌజ్‌కి శాశ్వతంగా వచ్చేసి సేంద్రియ వ్యవసాయం చేసే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఇలా జరిగిందని రాయీస్‌ తెలిపాడు.

‘సుశాంత్ సర్ తరచూ ఫామ్‌హౌస్‌ను సందర్శించేవారు. రియా, ఆమె తండ్రి పుట్టినరోజు లాంటి ప్రత్యేక రోజులను ఇక్కడే నిర్వహించేవారు. జనవరిలో సర్‌ తన పుట్టినరోజును జరుపుకునేందుకు రియాతో కలిసి వచ్చారు. వారి వెంట మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండా, శ్రుతి మోదీతోపాటు పలువురు మిత్రులు కూడా వచ్చారు’ అని పేర్కొన్నాడు. ‘గతేడాది అక్టోబర్‌లో ఐరోపా పర్యటన అనంతరం ఆయన అనారోగ్యానికి గురయ్యారు. రెండు నెలలుగా ఇక్కడికి రాలేదు. 2018లోనే ఫామ్‌హౌజ్‌ని అద్దెకు తీసుకున్నారు. ఏడాది తర్వాత ఒప్పందం పునరుద్ధరించే సమయానికి దానిని కొనాలనుకున్నారు. అనంతరం శాశ్వతంగా ఇక్కడికే వచ్చేసి సేంద్రియ వ్యవసాయం చేయాలని భావించారు. అందుకు తగినట్లు పలు ఏర్పాట్లు సైతం చేయించుకున్నారు’ అని రాయీస్‌ వివరించాడు. ఈ ఏడాది మే నెలలోనే అద్దె ఒప్పందం ముగిసినప్పటికీ జూన్‌, జులై నెలలకు సంబంధించి అడ్వాన్స్‌ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఫిబ్రవరిలో ఫామ్‌హౌజ్‌ని చివరిసారి సందర్శించినప్పుడు రెండు, మూడు నెలలపాటు అక్కడే ఉండేందుకు పలు ఏర్పాట్లు చేసుకున్నాడని, కానీ అది జరగలేదని వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు