సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో తొలి అరెస్టు

బాలీవుడ్ యువనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసులో తొలి అరెస్టు చోటుచేసుకుంది.

Published : 03 Sep 2020 02:44 IST

దిల్లీ: బాలీవుడ్ యువనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసులో తొలి అరెస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో మాదక ద్రవ్యాల కోణం ఉందనే అంశానికి సంబంధించి.. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. వారిలో ఒకరైన అబ్దుల్‌ బాసిత్‌ పరిహార్‌ను తాము ముంబయిలోని బాంద్రాలో అరెస్టు చేసినట్టు సంస్థ తెలిపింది.

‘‘బాసిత్‌కు సుశాంత్‌ మేనేజర్‌ సామ్యూల్‌ మిరాండాతో సంబంధం ఉన్నట్టు తెలిసింది. మిరాండా, రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ చక్రవర్తి సూచనల మేరకు మాదక ద్రవ్యాలను సేకరించినట్టు మాకు సమాచారం ఉంది.’’ అని ఎన్‌సీబీ వివరించింది. సుశాంత్‌ మాజీ మేనేజర్ మిరాండాను రియా చక్రవర్తి గత సంవత్సరం మే నెలలో నియమించారు. ఆయన సుశాంత్‌ ఇంటి నిర్వహణ, ఖర్చులు తదితర అన్ని వ్యవహారాలు చూసుకునేవారు. ఈయనపై సుశాంత్ కుటుంబ సభ్యులు డ్రగ్స్‌ సరఫరా చేయటం, సుశాంత్‌ డబ్బును భారీగా దుర్వినియోగం చేయటం వంటి ఆరోపణలు  చేశారు.

కాగా, రాజపూత్‌ మృతి కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రియాను పలుమార్లు ప్రశ్నించిన సీబీఐ, తొలిసారిగా ఆమె తల్లితండ్రులు ఇంద్రజిత్‌ చక్రవర్తి, సంధ్యలను సుమారు 8గంటల పాటు విచారించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని