Published : 01 Aug 2020 01:58 IST

సుశాంత్‌ ఆత్మహత్య కేసు: కీలక మలుపులు

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్య ఘటన వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా సుశాంత్‌ ఆత్మహత్య కేసు కీలక మలుపులు తీసుకుంటూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. తాజాగా మనీలాండరింగ్‌ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది. రియా, ఆమె కుటుంబ సభ్యులు సుశాంత్‌కు సంబంధించిన రూ.15కోట్లు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది.

గత నాలుగు రోజులుగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కుటుంబ సభ్యులు, నటి రియా చక్రవర్తిల నడుమ ఈ కేసు ఊహించని మలుపులు తీసుకుంటోంది. జులై 25న సుశాంత్‌ తండ్రి రియా చక్రవర్తిపై పట్నా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు.  దీంతో నలుగురు సభ్యులతో కూడిన పోలీసు బృందం జులై 29న ముంబయి చేరుకుని కేసు విచారణ చేపట్టింది. మరోవైపు ఈ కేసును పట్నా నుంచి ముంబయికి బదిలీ చేయాలని రియా చక్రవర్తి సుప్రీంకోర్టును అభ్యర్థించింది. బిహార్‌ ప్రభుత్వంతో పాటు సుశాంత్‌ తండ్రి ఈ అభ్యర్థనను తోసి పుచ్చారు.

మరోవైపు బిహార్‌ పోలీసులు సుశాంత్‌ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేశారు. అంతేకాకుండా రియా చక్రవర్తి ఇంటిని కూడా సోదా చేశారు. సుశాంత్‌ బ్యాంకు ఖాతా నుంచి రియా ఖాతాకు పెద్దగా నగదు బదిలీ ఏమీ జరగలేదని గుర్తించారు. సుశాంత్‌ కుటుంబ సభ్యులు చెబుతున్నంత నిల్వ కూడా ఖాతాలో లేదని తెలిసింది. సుప్రీంకోర్టుకు రియా సమర్పించిన పిటిషన్‌లో తాను సుశాంత్‌తో ఏడాదిగా లివ్‌-ఇన్‌ రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్లు తెలిపింది. అదే సమయంలో సుశాంత్‌ తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు చెప్పింది. సుశాంత్‌ మాజీ ప్రేమికురాలు అంకిత లోఖండే వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డు చేశారు.

ప్రస్తుతం బీఎండబ్ల్యూ, జాగ్వార్‌ కార్ల విషయంలో బిహార్‌ పోలీసులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.  గత రాత్రి అంకిత ఇంటికి ఆటోలో వచ్చిన పోలీసులు వెళ్లేటప్పుడు గంటసేపు విచారణ అనంతరం జాగ్వార్‌ కారులో వెళ్లారు. ఈ రోజు ఉదయం బిహార్‌ పోలీసులు బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకున్నారు. సుశాంత్‌ ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరపాలని సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికే డిమాండ్‌ చేశారు. కాగా, తాజాగా దీనిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్పందిస్తూ ‘సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కేసు సీబీఐకి అప్పగించాలని చాలా మంది కోరుతున్నారు. అయితే, మనీలాండరింగ్‌ జరిగిందన్న కోణం కూడా ఉండటంతో కనీసం ఈ  కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు అప్పగించాలి’ అని ట్వీట్‌ చేశారు. కొద్దిసేపటికే ఈడీ కేసు నమోదు చేయడం విశేషం.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts