సుశాంత్‌ సింగ్‌ది హత్యే: సుబ్రహ్మణ్య స్వామి

యువనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ది హత్య అని తను గట్టిగా నమ్ముతున్నట్టు భాజపా సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి ప్రకటించారు.

Published : 31 Jul 2020 02:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ది హత్య అని తాను గట్టిగా నమ్ముతున్నట్టు భాజపా సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి ప్రకటించారు. అలా భావించేందుకు ఆధారాలను కూడా ఆయన నేడు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. సుశాంత్‌ సింగ్‌ బాంద్రాలో ఉన్న తన నివాసంలో జూన్‌ 14న మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం వెలువడిన పోస్ట్‌మార్టం‌ నివేదికలో కూడా నటుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలియవచ్చింది. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ సాధ్యంకాదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్వామి స్పందిస్తూ.. వరుస ట్వీట్లు చేశారు.

హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ముంబయి మూవీ మాఫియా పనిచేస్తోందని.. ఈ క్రమంలో ఓ నటిని బలి చేసేందుకు రంగం సిద్ధమయిందని ఆయన అన్నారు. ‘‘సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ హత్య గురైయ్యాడని నేను ఎందుకు అనుకుంటున్నానంటే...’’ అంటూ ఆయన చేసిన మరో ట్వీట్‌లో 26 అంశాలతో కూడిన ఓ పత్రాన్ని షేర్‌ చేశారు. దానిలో ఆయన శరీరంపై ఎవరో కొట్టిన ఆనవాళ్లు ఉన్నట్టుగా ఉంది. అంతేకాకుండా సుశాంత్‌ మెడపై చిహ్నాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.
 ఈ నేపథ్యంలో సుశాంత్‌ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందిగా బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను సుబ్రహ్మణ్య స్వామి బుధవారం కోరారు. గతంలో ప్రధాని మోదీకి రాసిన లేఖలో కూడా యువనటుడి మరణంతో కొందరు బాలీవుడ్‌ పెద్దలకు సంబంధం ఉందని.. వారు ఈ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించాలంటూ ముంబయి పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ సుశాంత్‌ స్నేహితురాలు, నటి రియా చక్రవర్తిపై పట్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసు విచారణ కొనసాగుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని