నిరాహార దీక్ష చేపట్టనున్న సుశాంత్‌సింగ్‌ మిత్రులు

సీబీఐ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు..

Published : 28 Sep 2020 23:41 IST

సీబీఐ తీరుపై నిరసన

ముంబయి: నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్‌ మృతి కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు సుశాంత్‌ మిత్రులు పేర్కొన్నారు. ఆగస్టు 19న దర్యాప్తు చేపట్టిన సంస్థ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదని ఆరోపించారు. సుశాంత్‌కు న్యాయం జరగాలని కోరుతూ అక్టోబర్‌ 2 నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నటుడి‌ మిత్రులు గణేష్‌ హివాకర్‌, అంకిత్‌ ఆచార్య పేర్కొన్నారు. ఓ వీడియోలో మాట్లాడుతూ అక్టోబర్‌ 2 నుంచి మూడు రోజులపాటు దీక్ష చేయనున్నట్లు స్పష్టం చేశారు.

‘మా మిత్రుడికి న్యాయం చేయాలంటూ మేం మొదటినుంచీ డిమాండ్‌ చేస్తున్నాం. కానీ సీబీఐ ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు సాయశక్తులా కృషిచేస్తోంది. డ్రగ్‌ మాఫియా ఇక్కడితో అంతరించిపోవాలని కోరుకుంటున్నాం. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) కూడా శక్తిమేర పనిచేస్తోంది’ అంటూ హివాకర్‌ వీడియోలో మాట్లాడారు. పోలీసులు అనమతిస్తే దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద కానీ ముంబయిలో కానీ నిరాహార దీక్ష చేపడతామన్నారు. పోలీసులు ఎక్కడా అనుమతించకపోతే తమ ఇంటిలో దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. 

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ జూన్‌ 14న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా నటుడు మాదకద్రవ్యాలు తీసుకునేవాడని, అతడికి నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు సహా పలువురు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఎన్‌సీబీ నిర్ధారించింది. మాదకద్రవ్యాల‌ కేసులో ఇప్పటికి 18 మందిని అరెస్టు చేసింది. బాలీవుడ్‌ స్టార్‌ నటీమణులు దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌లకు కూడా సమన్లు జారీ చేయగా ఆదివారం వారు విచారణకు హాజరయ్యారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు