‘నువ్వే కావాలి’ మా జీవితాలను మార్చింది!

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ‘నువ్వే కావాలి’ సినిమా విడుదలై 20 ఏళ్ల పూర్తయింది. ఈ సందర్భంగా కథానాయకుడు తరుణ్‌, కథానాయిక రిచా, నటుడు సాయి కిరణ్‌ చిత్రంతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. 20 సంవత్సరాలు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నామన్నారు.

Published : 13 Oct 2020 14:41 IST

తరుణ్‌-రిచా-సాయికిరణ్‌ ముచ్చట్లు

హైదరాబాద్‌: తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ‘నువ్వే కావాలి’ సినిమా విడుదలై 20 ఏళ్ల పూర్తయింది. ఈ సందర్భంగా కథానాయకుడు తరుణ్‌, కథానాయిక రిచా, నటుడు సాయి కిరణ్‌ చిత్రంతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. 20 సంవత్సరాలు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నామన్నారు. నిర్మాతలు రామోజీరావు, స్రవంతి రవి కిశోర్‌, దర్శకుడు విజయ్‌ భాస్కర్‌కు, త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చెప్పిన విశేషాలు వారి మాటల్లోనే..

‘‘నువ్వే కావాలి’ సినిమా విడుదలై 20 ఏళ్లయ్యిందంటే నమ్మలేకపోతున్నా. ఇది హీరోగా నా తొలి సినిమా కావడం.. అద్భుతమైన విజయం సాధించడం అదృష్టంగా భావిస్తున్నా. దీనికి ముందు బాల నటుడిగా దాదాపు 30 సినిమాలు చేశా. తెలుగులో ‘మనసు మమత’ ద్వారా ఉషా కిరణ్‌ మూవీస్‌ సంస్థ నన్ను బాల నటుడిగా పరిచయం చేసింది. అదే బ్యానర్‌ నన్ను హీరోగా వెండితెరకు పరిచయం చేయడం సంతోషంగా అనిపించింది. ఈ విషయంలో నా జీవితాంతం రామోజీరావు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ‘నువ్వే కావాలి’ మొత్తం చిత్ర బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మలయాళ సినిమాకు తెలుగు రీమేక్‌ ఇది. కానీ స్క్రీన్‌ప్లే పరంగా విజయ్‌ భాస్కర్‌ గారు, త్రివిక్రమ్‌ గారు మార్పులు చేశారు. కామెడీ టైమింగ్‌, పంచ్‌లు అందర్నీ అలరించాయి’.

నేను ఇంటర్‌ చదువుతున్న సమయంలో సరదాగా ఓ ప్రకటనలో నటించా. రాజీవ్​ మేనన్​చేసిన ఈ ప్రకటనలో నేను, రిచా కలిసి నటించాం. అది చూసి.. ‘నువ్వే కావాలి’ కోసం నన్ను తీసుకున్నారు. నాకు స్క్రిప్టు చాలా నచ్చింది. సంతోషంగా సంతకం చేశా. దీనికి ముందు కూడా నా వద్దకు కొన్ని కథలు వచ్చాయి. కానీ, ఆ స్క్రిప్టులు నచ్చకపోవడంతో ఆసక్తి చూపలేదు. మరోసారి రామోజీరావు గారికి, రవి కిశోర్‌ గారికి, విజయ భాస్కర్‌ గారికి, త్రివిక్రమ్‌ గారికి, సీతారామశాస్త్రి గారికి, కోటి గారికి, రిచాకు.. ధన్యవాదాలు. సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు’’- కథానాయకుడు తరుణ్‌

‘‘20 ఏళ్లు గడిచిపోయాయి. మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు. మధుర జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. విజయ్‌ భాస్కర్‌ సర్‌.. మీరెలా ఉన్నారు?.. నన్ను నమ్మి, మీ సినిమాకు తీసుకున్నందుకు థాంక్యూ. మీరు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. రవి కిశోర్‌ సర్‌.. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నా. ఇదంతా రెండు రోజుల క్రితం జరిగినట్లుంది. త్రివిక్రమ్‌ సర్‌ నా డైలాగ్స్‌ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. తరుణ్‌.. నువ్వు ఉత్తమ సహనటుడివి. మనం తొలిసారి ఓ ప్రకటనలో నటించాం. ఆ తర్వాత చరిత్ర గుర్తుపెట్టుకున్న ‘నువ్వే కావాలి’ కోసం పనిచేశాం. రామోజీరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. రామోజీ ఫిల్మ్‌ సిటీతో నాకెంతో అనుబంధం ఉంది. హైదరాబాద్‌ను మిస్‌ అవుతున్నా. ‘నువ్వే కావాలి’ చిత్ర బృందానికి, అభిమానులకు నా కృతజ్ఞతలు’- కథానాయిక రిచా

‘‘నువ్వే కావాలి’ చిత్రం 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ఒక నటుడిగా, వ్యక్తిగతంగా.. నా జీవితంలో ఓ మార్గాన్ని నిర్ణయించిన టర్నింగ్‌ పాయింట్‌ ‘నువ్వే కావాలి’. దీనికి ముందు నేను ఈటీవీ సీరియల్‌ ‘శివ లీలలు’ చేశా. తర్వాత ఏం చేయాలనే తికమకలో ఉన్న సమయంలో ‘నువ్వు ఇదే చేయాలి’ అని నిర్ణయించింది ‘నువ్వే కావాలి’. నాకే కాదు తరుణ్‌, రిచా, సునీల్‌, త్రివిక్రమ్ గారికి.. ఇది ఆరంభ దశ. ఈ విషయంలో నేను రామోజీరావు గారికి, విజయ్‌ భాస్కర్‌ గారికి, రవి కిశోర్‌ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ చిత్రంతో నాకు ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. నా సినీ కెరీర్‌ ఇక్కడే ఆరంభమైంది. తొలుత కాస్త కంగారుపడ్డా. అప్పట్లో డిజిటల్‌ కెమెరాలు ఉండేవి కావు.. అన్నీ రీల్‌ కెమెరాలే.. ‘యాక్షన్‌’ అనగానే కెమెరా రోలింగ్‌ శబ్దం వచ్చేది. అది విని.. రికార్డ్‌ అవుతోందని భయపడేవాడిని. ఆ సమయంలో నాకు నటన నేర్పించి, తీర్చిదిద్దిన వ్యక్తి విజయ్‌ భాస్కర్‌ గారు. ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తొస్తుంటాయి. ‘ఇది డ్రామా కాదు.. సినిమా.. బాగా చేయాలి’ అనేవారు. రవి కిశోర్‌ గారు కూడా ఎంతో ప్రోత్సహించారు. ‘నీకు నటుడిగా మంచి భవిష్యత్తు ఉంది’ అనేవారు. నాకు, నాన్నకు ఆత్మవిశ్వాసం పెంచారు’.

‘నేను హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేశా. ఓ ప్రముఖ హోటల్‌లో రిసెప్షన్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలో ‘నువ్వే కావాలి’ ఆడిషన్స్‌కు పిలిచారు. ఉద్యోగంలో చేరిన వెంటనే సెలవు అడిగితే ఇవ్వలేదు. అయినా సరే ధైర్యం చేసి, వదిలొచ్చేశా. ఆడిషన్స్‌లో ఇచ్చిన డైలాగ్‌ చెప్పా.. బాగుందన్నారు. మా నాన్నకు ఫోన్‌ చేసి ‘‘నువ్వే కావాలి’ సినిమాకు మీ అబ్బాయిని తీసుకున్నాం’ అని చెప్పారు. ఆ రోజే చెక్‌ కూడా ఇచ్చారు. అర్ధగంటలో నా జీవితం మారిపోయింది. చిత్ర పరిశ్రమలో మన జీవితం ఎప్పుడు మారుతుందో చెప్పలేం.. ఉన్నట్లుండి పైకి చేరుకుంటాం, ఒక్కసారిగా కిందపడిపోతాం. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి’- నటుడు సాయి కిరణ్‌

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని