Gopichand: వారి కష్టం ముందు మనదెంత అనిపించింది..!

‘‘నేను తొలిసారి క్రీడా నేపథ్యంలో నటించిన చిత్రం ‘సీటీమార్‌’’ అని తెలిపారు నటుడు గోపీచంద్‌. సంపత్‌ నంది దర్శకత్వం వహించిన సినిమా ఇది. తమన్నా కథానాయిక. భూమిక

Published : 07 Sep 2021 21:17 IST

హైదరాబాద్‌:  ‘‘నేను తొలిసారి క్రీడా నేపథ్యంలో నటించిన చిత్రం ‘సీటీమార్‌’’ అని తెలిపారు నటుడు గోపీచంద్‌. సంపత్‌ నంది దర్శకత్వం వహించిన సినిమా ఇది. తమన్నా కథానాయిక. భూమిక, సూర్యవంశీ దిగంగన కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గోపీచంద్‌ మీడియాతో ముచ్చటించారు. 

* నేనిప్పటి వరకు క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటించలేదు. ఇదే తొలిసారి. దర్శకుడు సంపత్‌ నంది చెప్పిన ‘సీటీమార్‌’ కథ నచ్చింది. వెంటనే ప్రారంభించాం. కబడ్డీ ప్రధానాంశంగా ఈ సినిమా రూపొందింది. ఇతర కబడ్డీ చిత్రాలకు, ఈ సినిమాకీ చాలా తేడా ఉంది. ఇందులో అమ్మాయిలకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. రెండు కబడ్డీ జట్టుల మధ్య ఆసక్తికర పోరు తప్పకుండా మెప్పిస్తుంది. నేనూ తమన్నా కోచ్‌లుగా కనిపిస్తాం. ఈ చిత్రంలో భూమిక నాకు సోదరిగా నటించారు. ఆ పాత్ర భావోద్వేంగా సాగుతుంది. నేను సీరియస్‌గా కనిపిస్తా, సరదాగానూ కనిపిస్తా.

* ఈ చిత్రంలో కావాల్సినన్ని కమర్షియల్‌ హంగులూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో వచ్చిన ఇతర సినిమాలకీ, ఈ చిత్రానికీ పోలిక ఉందని అనుకుంటున్నారు. ఒక మంచి చిత్రం నుంచి స్ఫూర్తిపొందడంలో తప్పులేదు. ఎంత కొత్తగా చూపించమన్నది ముఖ్యం. సంపత్‌ నందితో గతంలో ‘గౌతమ్‌ నంద’ సినిమా చేశా. అది అనుకున్నంత ఫలితం అందించలేదు. అప్పుడు ఏం పొరపాటు చేశామో తెలుసుకుని, ఈసారి బాగా తీయాలని అనుకున్నాం. నటులు, సాంకేతిక బృందం చాలా శ్రమించింది.

* ఈ సినిమాలో సందేశం అంటూ ఏం ఉండదు. కోచ్‌ అనుకున్న లక్ష్యం ఎలా చేరుకున్నాడా, లేదా? అనే కోణంలో సాగుతుంది. నలుగురు కబడ్డీ ప్లేయర్స్‌ ఈ సినిమాలో నటించారు. కబడ్డీ గురించి వారి నుంచి ఎంతో నేర్చుకున్నా. వారి కష్టం ముందు మనదెంత అనిపించింది. 

* ఎవరిష్టం వారిది. ఎవరినీ కామెంట్‌ చేయకూడదు. వారి ఆర్థిక పరిస్థితుల్ని బట్టి సినిమా విడుదల చేస్తుంటారు. థియేటర్‌ అనుభూతి వేరు. ఓటీటీ వేరు. భవిష్యత్తులో ఓటీటీకి అవకాశాలు పెరుగుతాయని అనుకుంటున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని