అందుకే నాకు పరాజయాలు తక్కువ

‘‘ఒక్క సినిమాతో వచ్చే ‘స్టార్‌డమ్‌’ గురించి నాకు పెద్దగా ఆలోచన లేదు. బాక్సాఫీస్‌ లెక్కల్ని అసలు పట్టించుకోను. ఎందుకంటే అది మన చేతుల్లో లేని వ్యవహారం. నా లక్ష్యం ఎప్పుడూ ఒకటే.. ‘సుధీర్‌ ఏ పాత్రయినా చేయగలడు’ అనుకునేలా

Updated : 27 Aug 2021 08:20 IST

‘‘ఒక్క సినిమాతో వచ్చే ‘స్టార్‌డమ్‌’ గురించి నాకు పెద్దగా ఆలోచన లేదు. బాక్సాఫీస్‌ లెక్కల్ని అసలు పట్టించుకోను. ఎందుకంటే అది మన చేతుల్లో లేని వ్యవహారం. నా లక్ష్యం ఎప్పుడూ ఒకటే.. ‘సుధీర్‌ ఏ పాత్రయినా చేయగలడు’ అనుకునేలా కెరీర్‌ కొనసాగించాలనుంది’’ అన్నారు సుధీర్‌బాబు. కొత్తదనం నిండిన కథలకు చిరునామాగా నిలిచే యువ హీరోల్లో ఆయన ఒకరు. ఇప్పుడాయన నుంచి వస్తున్న సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. కరుణ కుమార్‌ దర్శకుడు. ఈరోజే థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సుధీర్‌బాబు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..

‘‘వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న మంచి కథ ఇది. కావాలని డ్యాన్సులు.. పోరాటాలు ఎక్కడా ఇరికించలేదు. ప్రతిదీ కథలో భాగంగానే సాగుతాయి. కరుణ కుమార్‌ తొలి చిత్రం ‘పలాస’కు పూర్తి భిన్నంగా ఉంటుంది. అది 1974లో సాగే కథ అయితే.. ఇది ప్రస్తుతానికి సంబంధించినది. చుట్టూ జరుగుతున్న అనేక అంశాల్ని దీంట్లో చర్చించాం. ఈ క్రమంలోనే కుల ప్రస్తావనా ఉంటుంది. అలాగని ఏదో ఓ కులాన్ని ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించలేదు. ఓ గ్రామంలో ఉండే లోకల్‌ పాలిటిక్స్‌.. మనుషుల స్వభావాలు, ఈగోలు వంటివన్నీ కనిపిస్తాయి. సినిమా ఆద్యంతం వాస్తవికతకు అద్దం పట్టేలా ఉంటుంది’’.

ఎలక్ట్రిషన్‌ పని పరిశీలించి..

‘‘నేనిందులో సూరిబాబు అనే ఎలక్ట్రిషన్‌ పాత్రను పోషించా. సూరికి తన తల్లి అంటే ఎంతో ప్రేమ. అమ్మలాంటి అమ్మాయి తన   జీవితంలోకి రావాలని కోరుకుంటాడు. ఈ క్రమంలోనే తను కోరుకున్న లక్షణాలున్న అమ్మాయి శ్రీదేవి పరిచయం అవుతుంది. మరి వాళ్లెలా ప్రేమలో పడ్డారు? ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది. సూరి పాత్రలో ఒదిగిపోయేందుకు నేను ఓ ఎలక్ట్రిషన్‌ పనిని దగ్గరుండి పరిశీలించా. చిన్నప్పటి నుంచి హాస్టల్‌లో పెరిగా కాబట్టి.. స్నేహితుల ద్వారా వివిధ ప్రాంతాల యాసల్ని తెలుసుకోగలిగా. అందుకే ఈ చిత్రంలో గోదావరి యాస పట్టుకోవడం చాలా తేలికైంది’’.

వాళ్ల సినిమాల్ని కేస్‌ స్టడీలా..

‘‘ఇప్పటి వరకు ఏ దర్శకుడూ నా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని నా   దగ్గరకు రాలేదు. మంచి కథతో.. దానికి నేను న్యాయం చేయగలననే నమ్మకంతోనే వచ్చారు. అందుకే నా కెరీర్‌లో పరాజయాలు తక్కువగా ఉన్నాయి. కృష్ణ, మహేష్‌బాబు సినిమాల్ని కేస్‌ స్టడీలా తీసుకుంటా. అంతేకానీ వాళ్లు చేసిందే నేను చేయాలని అనుకోను. కథల ఎంపికలో నా ప్రత్యేకత ఉండాలనుకుంటా. ఫలానా పాత్రలు చేయాలని లక్ష్యాలేమి లేవు’’.

అలా ఆలస్యం..

పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ ఆలస్యమవడానికి అనేక  కారణాలున్నాయి. దీన్ని మొదట ఓ నిర్మాణ సంస్థలో అనుకున్నాం. తర్వాత మరో పెద్ద నిర్మాణ సంస్థలోకి వెళ్లింది. ఇప్పుడు బాలీవుడ్‌ నుంచి మరో పెద్ద నిర్మాణ సంస్థ వచ్చింది. సినిమా కచ్చితంగా ఉంటుంది. వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఈలోగా నేను ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో పాటు హర్ష వర్ధన్‌ దర్శకత్వంలో చేయాల్సిన మరో చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని