Updated : 13 Sep 2021 07:21 IST

నేనెలా చేస్తానోనని భయపడ్డా

‘‘రీమేక్‌ అనగానే కచ్చితంగా పోలికలు వస్తుంటాయి. కథని, నటీనటులు పోషించే పాత్రల్ని మాతృకతో పోల్చి చూస్తుంటారు. కాబట్టి ఒరిజినల్‌  వెర్షన్‌లోని అందాన్ని చెడగొట్టకుండా.. మనదైన శైలిలో సరికొత్తగా చూపించడం అటు దర్శకుడికి, ఇటు నటీనటులకు సవాలే’’ అంది నటి నభా నటేష్‌. తొలి దశ కరోనా తర్వాత వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేసిన ఆమె.. ఇప్పుడు రెండో దశ తర్వాత ‘మాస్ట్రో’తో వస్తోంది. నితిన్‌ హీరోగా నటించిన చిత్రమిది. మేర్లపాక గాంధీ దర్శకుడు. తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఈనెల 17న ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది నభా. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

‘‘అంధాధూన్‌’ బాలీవుడ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ లాంటి చిత్రం. అప్పట్లో దీని పేరు చాలా వినిపించింది. అలాంటిది ఈ చిత్ర రీమేక్‌లో నాకు అవకాశం రావడంతో చాలా ఆనందంగా అనిపించింది. అయితే మొదట్లో నాకు కాస్త భయంగానూ అనిపించింది. ఎందుకంటే మాతృకలో రాధికా ఆప్టే అద్భుతంగా నటించింది. ఆ పాత్రని నేనెలా చేయగలను? అని భయపడ్డా. తెలుగు సినిమా ప్రారంభించడానికి ముందు మాతృక చూసినా.. తర్వాత మళ్లీ చూడకూడదనుకున్నా. ఎందుకంటే ఆ ప్రభావం నా నటనపై పడుతుంది’’


‘‘ఇది రీమేక్‌ అయినా దర్శకుడు తన విజన్‌తో సినిమాని చాలా కొత్తగా తీశారు. ప్రేక్షకులకి ఓ తెలుగు చిత్రం చూస్తున్న అనుభూతే కలుగుతుంది. నా పాత్ర విషయంలోనూ ఎన్నో మార్పులు చేశారు. అంధుడిగా నితిన్‌ అద్భుతంగా నటించారు. మా ఇద్దరి సన్నివేశాలు, పాటలు బాగా వచ్చాయి. తమన్నా నాకెంతో సహకరించింది. ఈ చిత్రానికి నేనే డబ్బింగ్‌ చెప్పాలి అనుకున్నా. కానీ, కరోనా పరిస్థితుల వల్ల కుదర్లేదు. తర్వాతి సినిమాల్లో తప్పకుండా నా సొంత గళమే వినిపిస్తా’’.


‘‘ఇది వరకు నుంచే నాకు ఓటీటీ భయం ఉండేది. కరోనా సమయంలో నా రెండు సినిమాలు థియేటర్లలోనే విడుదలయ్యాయి. ఇప్పుడొస్తున్నది మూడోది. కానీ, ఈసారి ఓటీటీలోకి రావడం తప్పలేదు. ఇంకా థియేటర్ల సమస్య అలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీలో అయితే అందరూ చూసే వీలు కలుగుతుంది. నేను చేసే ప్రతి సినిమా ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఉండేలా చూసుకుంటా. నటిగా నాకు అన్ని రకాల జానర్లు, పాత్రలు చేయాలనుంది. భవిష్యత్‌ ప్రాజెక్ట్‌ల గురించి అధికారికంగా ప్రకటించే వరకు  చెప్పలేను’’.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని