తెలుగు చెల్లెళ్లకు హీరో అన్నయ్యలు

అమ్మా..నాన్న లేరులే...అని ఏ చెల్లినీ తక్కువగా చూడద్దురోయ్‌... అమ్మ ప్రేమను... నాన్న బాధ్యతను పంచుకొని.. అష్టఐశ్వర్యాలు ఇవ్వగలిగే ‘రక్తసంబంధం’ ఎన్టీఆర్‌లుంటారు. చెల్లే ప్రాణంగా బతికే అన్నకు, ఆ ప్రాణమే లేకుండా చేశారని తెలిస్తే..

Updated : 07 Dec 2022 16:25 IST

అమ్మా..నాన్న లేరులే...అని ఏ చెల్లినీ తక్కువగా చూడద్దురోయ్‌... అమ్మ ప్రేమను... నాన్న బాధ్యతను పంచుకొని.. అష్టఐశ్వర్యాలు ఇవ్వగలిగే ‘రక్తసంబంధం’ ఎన్టీఆర్‌లుంటారు. చెల్లే ప్రాణంగా బతికే అన్నకు, ఆ ప్రాణమే లేకుండా చేశారని తెలిస్తే.. అలా చేసిన వారి గుండెలు చీల్చకుండా ఉంటాడా? అన్నంటే తోడుండే వాడే కాదురా... తేడా వస్తే ప్రాణాలు తోడేసే బాలకృష్ణ లాంటి ముద్దులమామయ్య’లూ ఉంటారు. ఒంటరిగా కాలేజీకి వెళ్తుంది కదా! ఒక్కతే మార్కెట్టుకొచ్చింది లే! వీధిలో టీజ్‌ చేస్తే ఏంటి? అని ఆలోచిస్తున్నావా? చిరు లాంటి ‘హిట్లర్‌’లు, పవన్‌కల్యాణ్‌ లాంటి ‘అన్నవరం’ అన్నలు ముందో వెనుకో ఉంటారు చూసుకో... కాళ్లు చేతులు విరగకుండా భద్రం చేసుకో! ఆడపిల్ల...ఈడ పిల్ల కాదనీ.. అత్తగారింట్లో అన్నీ భరిస్తుందిలే అనీ...రాచిరంపాన పెడితే అడిగేదెవరనీ... విర్రవీగుతున్నారా... కాస్త తగ్గండి.. ‘అర్జున్‌’లో మహేష్‌లాంటి తమ్ముళ్లుంటారు. అక్కలకు రక్షణై నిలుస్తారు. కట్నం తేలేదని... మగపిల్లోణ్ని కనివ్వలేదని.. ఇంకో కట్నం తెచ్చుకోవచ్చనీ..దురాశలకు పోయి.. బంగారుతల్లి సంసారంలో నిప్పులు పోశారో....! ‘రాఖీ’ ఎన్టీఆర్‌లుంటారు... మిమ్మల్నే పెట్రోల్లా మండిస్తారు. జాగ్రత్తరా... జాగ్రత్త! తెలుగు చెల్లెళ్లకు...  అన్నయ్యలంతా హీరోలే. తెలుగు అన్నయ్యలకు...  చెల్లెళ్లంటే ప్రాణాలే..!


అన్నయ్య అంటే హోదా కాదు బాధ్యత

చిత్రం పేరు: బ్రో; సంగీతం: శేఖర్‌ చంద్ర; సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్‌; గానం: సునీత; దర్శకత్వం: కార్తీక్‌;

అమ్మానాన్న... దేవుడిచ్చిన బంధం.... అన్నాచెల్లి... అమ్మానాన్నలు ఇచ్చిన    రక్త సంబంధం. చెల్లి చిరునవ్వే అన్నకు ఐశ్వర్యం. అన్న ఆదరణే చెల్లికి మనో ధైర్యం. ఈ బంధాన్ని తెరపై ఆవిష్కరిస్తూ ఎన్నో పాటలు వచ్చాయి. ప్రస్తుతం మరో ప్రత్యేక గీతాన్ని రచించారు ప్రముఖ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమార్‌. ‘చి బ్రో’ చిత్రం కోసం ‘‘।।అన్నయ్యా నువ్వు పిలిస్తే.. చెల్లిలా జన్మనెత్తానూ।। చెల్లెమ్మ నువ్‌ పుట్టాకే అన్నలా నేను పుట్టాను।।’’ అంటూ ఒకే బాణీకి రెండు పాటలందించారు. రాఖీ పండగ సందర్భంగా అన్నయ్య అంటే హోదా కాదు బాధ్యత అంటోన్న  భాస్కరభట్ల... పాటల్లోని బంధాన్ని, అక్కా, చెల్లితో ఉన్న అనుబంధాన్ని ‘ఈనాడు సినిమా’తో పంచుకున్నారు.

‘‘చెల్లి అంటే అన్నయ్యలందరికి ఇష్టం. అలాంటి చెల్లి కోసం అన్నయ్య చాలా త్యాగాలు చేస్తుంటాడు. ఇందులో హీరో బాల్యాన్నే త్యాగం చేస్తాడు. చెల్లెలు బాగుండటం కోసం దూరమైన ఓ అన్నయ్య కథ ఇది. అలాంటి అన్నయ్య చాలా కాలం తర్వాత వస్తే ఆ చెల్లెమ్మ పాడుకునే పాట ఇది. ఈ పాటలో అంతర్లీనంగా ఒక భావోద్వేగమైన కథ నడుస్తుంటుంది.  లిరిక్స్‌ సన్నివేశానికి తగినట్టుగా, పాట విన్నప్పుడు కథ తెలియకుండా రాయాలి. ఇది ఒకరకంగా కత్తిమీద సాము. దీనికి అనుబంధంగా చిన్నప్పుడు హీరో పాడే పాట ఉంటుంది. ‘చెల్లెమ్మ నువ్‌ పుట్టాకే అన్నలా నేను పుట్టాను’ అని పాడుకుంటాడు. ఆ పాటకు ఈ పాటకు మధ్యలో జరిగేదే కథ. చెల్లి పుట్టిందనగానే అన్నయ్య మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో రాశాను.  బాల్యంలో చిన్నపిల్లాడు పాడుకునే పాట అది. బాధ్యతలు తెలిశాక చెల్లి అన్నయ్యను గుర్తుచేసుకుని పాడే పాట ఇది. ఒకే బాణికి అన్నయ్య, చెల్లెలు పాటలు ఉంటాయి. దేనికి అదే ప్రత్యేకం. రెండో చరణంలో ।పొలిమారిపోతుంటే నే తలుచుకున్నట్టే అనుకోమంటానూ। లైన్‌ నాకా బాగా నచ్చింది. ఆ తర్వాత ।నా కంట్లో రావాల్సిన కన్నీరంతా నీ ఒంట్లో చెమటల్లే మార్చావు కదరా। అంటుంది చెల్లి. ఇవి బాగా నచ్చాయి. సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర ట్యూన్స్‌కు రాయడమంటే చాలా ఇష్టం. ఎక్కువ మాస్‌ పాటలు రాసే నేను మెలోడీ   రైటర్‌గా మారడానికి శేఖర్‌ చంద్ర సంగీతం ఎంతో తోడ్పడింది. ‘నచ్చావులే’, ‘నువ్విలా’, ‘మనసారా’, ‘మేం వయస్సుకు వచ్చాం’ తదితర చిత్రాల్లో ఎక్కువ మెలోడీలు శేఖర్‌ చంద్ర సంగీతానికి రాశాను.   దర్శకుడు కార్తీక్‌ ఈ కథ చెప్పినప్పుడే నాకు కన్నీళ్లు వచ్చాయి. పాట పాడేటప్పుడు సునీత గారు తన పిల్లలను గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఈ చిత్రంలో అన్నయ్య, చెల్లెలు ఇద్దరి మనసులు ప్రతిబింబించేలా రెండు పాటలు రాయడం నా అదృష్టం అనుకోవాలి.

ఈ రోజుకోసం నేనెంతగానో
చూస్తూనే వున్నాను ఇన్నాళ్ళుగా
మౌనాలు అన్నీ మాటాడుతుంటే
కనువిందుగా వుంది తొలిసారిగా
అపురూపమేగా నాకీ క్షణాలు  
దాచేసుకుంటాను జ్ఞాపకాలుగా  
।।అన్నయ్యా.. నువ్వుపిలిస్తే.. చెల్లిలా జన్మనెత్తానూ
హాయిహాయిగా నువ్వునవ్వితే ఎంతఎంత మురిసిపోతానూ
అన్నయ్యా నువ్వుతలిస్తే.. కళ్ళముందు వాలిపోతానూ
నువ్వుపంచినా ప్రేమకెప్పుడూ రుణపడిపోయేవుంటానూ।।
చరణం: 1  
నాకోసం ఎన్నోవదిలీ
దూరంగా శిలలా బతికావే
నా కంట్లో రావాల్సిన కన్నీరంతా
నీ ఒంట్లో చెమటల్లే మార్చావు కదరా  
నాకోసం నువ్వెంత అల్లాడిపోయావూ
నీకన్నా ఇష్టంగా నను చూసుకున్నావూ
నీపిచ్చి ప్రేమంతా నాకే కాకుండా వదినమ్మకీ దాచరా
।।అన్నయ్యా నువ్వుపిలిస్తే.. ।।  
చరణం: 2
నాకోసం వెతికీ వెతికీ
ఏ నిమిషం దిగులే పడిపోకూ
నేనెక్కడికెళతానూ నిన్నే విడిచీ
నీ వెచ్చని ఊపిరిలో వున్నాను కలిసీ  
నీ గుండె చప్పుళ్ళు వింటూనే వుంటానూ
నువుచేసే అల్లర్లూ చూస్తూనే వుంటానూ
పొలిమారిపోతుంటే నే తలుచుకున్నట్టే అనుకోమంటానూ  
।।అన్నయ్యా నువ్వుపిలిస్తే..।।
మా అక్కా... నాకు చెల్లే..

నాకు మా అక్క లలిత, చెల్లి శ్రీవిద్య ఉన్నారు. మా అక్క నేను అన్నయ్యలా పుడితే బాగుండు అనుకుంటుంది.  ఎందుకంటే నాకు మా అక్క మీద   అజమాయిషీ ఎక్కువ. వయస్సులో నాకంటే పెద్దదైనా చెల్లిగానే భావిస్తాను. తనూ నన్ను అన్నయ్యగానే చూస్తుంది. అప్పుడప్పుడూ చిన్ననాటి విషయాలన్నీ గుర్తుకొస్తుంటాయి. అల్లరి పనులు అన్ని గుర్తుచేసుకొని నవ్వుకుంటాం. కానీ వాళ్లు ఏదైనా సమస్యల్లో ఉన్నారు, అవసరాలు ఉన్నాయంటే వాళ్లు చెప్పకుండానే నేను అర్థం చేసుకుంటాను. ఏ విషయాన్నైనా మాట్లాడే చనువు మా ముగ్గురి మధ్య ఉంటుంది. ఈ పాట విన్న మా చెల్లి ఫోన్‌ చేసి ఏడ్చేసింది. మా అక్కైతే నేను చెల్లిగా పుట్టి ఉంటే బాగుండేదిరా అంది. ఏదైనా ఒక సంవత్సరం ఈ పండక్కి మేం కలవకపోతే పోస్టులో రాఖీలు పంపిస్తారు. మా చెల్లైతే అస్సలు మరిచిపోదు. రాఖీ పండగ రోజే మా చెల్లెలు పుట్టినరోజు. కుటుంబంలో  ఎన్ని ఘర్షణలున్నా చెల్లితో ఆ బంధం ఎప్పటికీ ఉంటుంది. ఒకవేళ గొడవలు వచ్చినా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకోవాలి. కానీ ఆస్తుల కోసం విడిపోతున్న అన్నాచెల్లెళ్లను చూస్తే బాధేస్తుంది. అన్నయ్యకు చెల్లితో చనువు ఉండాలి,  అనుబంధం ఉండాలి. అన్నిటికంటే బాధ్యత ఉండాలి. రక్షాబంధన్‌ రోజు రాఖీ కట్టించుకోవడం అనేది  పక్కనపెడితే మనసులో మనం రక్షగా ఉంటామని ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఆ మేరకు కంటికి రెప్పలా కాచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని