నాగ్‌ డబుల్‌ ధమాకా

‘అతణ్ని చంపలేరు. అతని నుంచి తప్పించుకుని పారిపోలేరు. అతనితో మాటలు సాగవు. కేవలం వేడుకోవడం తప్ప! మరి వేడుకున్నాకైనా దయ చూపుతాడా?

Updated : 30 Aug 2021 07:23 IST

‘అతణ్ని చంపలేరు. అతని నుంచి తప్పించుకుని పారిపోలేరు. అతనితో మాటలు సాగవు. కేవలం వేడుకోవడం తప్ప! మరి వేడుకున్నాకైనా దయ చూపుతాడా? ఆ విషయం తెలియాలంటే మాత్రం ‘ది ఘోస్ట్‌’ చూడాల్సిందే’ అంటున్నారు ప్రవీణ్‌ సత్తారు. ఆయన దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. నారాయణ్‌దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. ఈ కలయికలో రూపొందుతున్న చిత్రానికి ‘ది ఘోస్ట్‌’ అనే పేరుని ఖరారు చేశారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆదివారం పేరుతో మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. గుల్‌పనాగ్‌, అనిఖా సురేంద్రన్‌ తదితరులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఛాయాగ్రహణం: ముఖేష్‌.జి, కళ: బ్రహ్మ కడలి, పోరాటాలు: నభా, రాబిన్‌ సుబ్బు.


‘బంగార్రాజు’ మళ్లీ వచ్చాడు

పంచెకట్టు.. కళ్ల జోడు... మెలేసిన మీసాలు... - ఇవి చాలు కదా, సోగ్గాడు బంగార్రాజు గురించి చెప్పడానికి. ఆ బంగార్రాజు ఇప్పుడు తిరిగొచ్చాడు. ఆయనకి ఈసారి మరో సోగ్గాడూ తోడయ్యాడు. మరి వీళ్ల సందడి ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ‘బంగార్రాజు’ విడుదల వరకు ఆగాల్సిందే. విజయవంతమైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి కొనసాగింపుగా నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా రూపొందుతున్న చిత్రమిది. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘బంగార్రాజు’ లుక్‌ని విడుదల చేశారు. అందులో అచ్చ తెలుగు దసరా బుల్లోడులా కనిపిస్తున్నారు నాగార్జున. సినిమాలో ఆయనకి జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగచైతన్య సరసన కృతిశెట్టి ఆడిపాడుతోంది. చలపతిరావు, రావు రమేష్‌, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్‌, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: యువరాజ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు