Updated : 20 Sep 2021 08:49 IST

చిత్ర పరిశ్రమ సంక్షోభంలో ఉంది.. ప్రభుత్వాలు ఆదుకోవాలి

- చిరంజీవి

‘‘క్కడ ఏ విపత్తు వచ్చినా.. ఏ సమస్యలొచ్చినా ముందుగా స్పందించేది మా చిత్ర పరిశ్రమే. అలాంటి ఇండస్ట్రీ ఈరోజున సంక్షోభంలో పడిపోయింది. సినిమా వ్యయాలు పెరిగిపోయాయి. ఎక్కడా రాజీ పడే పరిస్థితులు లేవు. అందుకే ఇండస్ట్రీని ఆదుకునేందుకు ముందుకు రావాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్ని వినమ్రంగా కోరుతున్నా’’ అన్నారు కథానాయకుడు చిరంజీవి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘లవ్‌స్టోరీ’ చిత్ర విడుదల ముందస్తు వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది. శేఖర్‌ కమ్ముల తెరకెక్కించారు. నారాయణ దాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌, కథా నాయకుడు చిరంజీవి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘లవ్‌స్టోరీ’ టైటిల్‌ విన్నప్పుడే చాలా ఆసక్తిగా అనిపించింది.

నాగచైతన్య మంచి కథలు ఎంచుకుంటుంటాడు. ఈ ‘లవ్‌స్టోరీ’ తనకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. ఈ ‘లవ్‌స్టోరీ’ ప్రీరిలీజ్‌ వేదికగా రెండు ప్రభుత్వాలకి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. మా సమస్యల్ని రెండు ప్రభుత్వాలకు విన్నవించుకున్నాం. సానుకూలంగా స్పందించారు. కానీ, ఇంత వరకు జీవో రాలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ సభా వేదికగా అడుగుతున్నాను. మీరు కనికరించండి. మా వినతిని ప్రత్యేకంగా తీసుకోండి. నలుగురు హీరోలు, నలుగురు దర్శకులు బాగా సంపాదించుకుంటున్నారు కదా అని అంతా బాగున్నట్లే అనుకోకండి. ఆ నలుగురైదుగురినే దృష్టినే పెట్టుకుని ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది పడేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. దయచేసి కొంచెం సానుకూలంగా స్పందించి.. మా అభ్యర్థనల్ని మన్నించండి. మేం ఆశగా అడగట్లేదు. అవసరానికి అడుగుతున్నాం. అది మీరు ఒప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేకపోతే మేం సినిమాలు పూర్తయ్యి కూడా రిలీజ్‌ చేయాలో లేదో తెలియని సందిగ్దంలో పడిపోతున్నాం. అసలు జనం వస్తారా? రారా? అన్న పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కాస్త ధైర్యం వస్తోంది. ప్రభుత్వాలు తమ వంతు ధైర్యాన్ని మాకు అందించాలి. ఎన్నో ఏళ్లుగా చిత్ర పరిశ్రమను చూస్తున్నాం. ఇక్కడ సక్సెస్‌ రేటు పది నుంచి ఇరవై శాతం మధ్యే ఉంటుంది. దీనికే ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంటుంది అనుకుంటుంటారు. కానీ, ఇక్కడ కష్టాలు పడేవారు. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులు.. ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షలాది మంది ఉన్నారు. కొందరు బాగున్నంత మాత్రాన పరిశ్రమ మొత్తం పచ్చగా ఉన్నట్లు కాదు. అది కరోనా సమయంలో సుస్పష్టంగా తెలిసొచ్చింది. చిత్రీకరణలు ఆగిపోయే సరికి కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారన్నది కళ్లారా చూశాం. మాకు తోచినట్లుగా వాళ్లని.. వీళ్లని, సినీ హీరోలు, ఇతర పెద్దల్ని అడిగి.. కార్మికులకు నిత్యావసరాలు అందించాం’’ అన్నారు.

ఈ వేడుకలో ఆమిర్‌ ఖాన్‌ మాట్లాడుతూ ‘‘నాగచైతన్యను ‘లాల్‌ సింగ్‌ చద్దా’ కోసం తొలిసారి  కలిశాను. తనతో పనిచేస్తుంటే.. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. ఈ వేడుక కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ‘లవ్‌స్టోరీ’ ట్రైలర్‌ నాలుగు రోజుల క్రితమే చూశా. చాలా నచ్చింది. సినిమాలోని సాయిపల్లవి డ్యాన్స్‌కి ఫిదా అయ్యాను. శేఖర్‌ కమ్ములపై అతిథులు చూపిస్తున్న ప్రేమ నన్ను కదిలిస్తోంది’’ అన్నారు.

* తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘నాగచైతన్య, సాయిపల్లవి జంట ఈ సినిమాలో చాలా బాగుంది. వాళ్లిద్దరూ బాగా నటించారని ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది’’ అన్నారు.

హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. ‘‘లవ్‌స్టోరీ’ నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. ఇప్పటి వరకు ఏ సినిమా కోసం చేయనంతగా ఈ చిత్రంలోని పాత్ర కోసం కష్టపడ్డా. శేఖర్‌ కమ్ముల చెప్పిన కథలోని లోతు చూసినప్పుడు.. ఈ మనిషి కోసం ఎంత దూరమైనా వెళ్లొచ్చు అనిపించింది’’ అన్నారు.

* ‘‘లవ్‌స్టోరీ’ చూశాక ఓ మంచి ఆలోచనతో ఇంటికి వెళ్తారు. అమ్మాయిలు చూసి తెలుసుకునేందుకు ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన విషయం ఉంది’’ అంది నాయిక సాయిపల్లవి.

* దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ.. ‘‘సినిమా గురించి చిరంజీవి చెప్పిన మాటలు మాకెంతో ఉత్సాహాన్నిచ్చాయి. ఆమిర్‌లా మరే స్టార్‌ సమాజం కోసం ఆలోచించలేర’’న్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నారయణ దాస్‌ కె.నారంగ్‌, సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, పవన్‌ సి.హెచ్‌, చైతన్య పింగళి తదితరులు పాల్గొన్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని