శేఖర్‌ కమ్ముల కోరుకున్నది అదొక్కటే!

‘‘సారంగ దరియా..’’తో కుర్రకారును ఉర్రూతలూగించాడు. ‘‘నీ చిత్రం చూసి..’’ పాటతో శ్రోతల మనసుని సుతిమెత్తగా మీటాడు. తొలి అడుగులోనే తన స్వరాలతో లక్షలాది గుండెల్ని మీటి శభాష్‌ అనిపించుకున్నాడు. ‘లవ్‌స్టోరీ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న ఆ సంగీత దర్శకుడే

Updated : 07 Dec 2022 14:25 IST

‘‘సారంగ దరియా..’’తో కుర్రకారును ఉర్రూతలూగించాడు. ‘‘నీ చిత్రం చూసి..’’ పాటతో శ్రోతల మనసుని సుతిమెత్తగా మీటాడు. తొలి అడుగులోనే తన స్వరాలతో లక్షలాది గుండెల్ని మీటి శభాష్‌ అనిపించుకున్నాడు. ‘లవ్‌స్టోరీ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న ఆ సంగీత దర్శకుడే పవన్‌ సి.హెచ్‌. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాని శేఖర్‌ కమ్ముల తెరకెక్కించారు. నారాయణ దాస్‌.కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు పవన్‌ సి.హెచ్‌.

దీ ‘‘లవ్‌స్టోరీ’ ఓ భావోద్వేగ భరితమైన ప్రేమకథతో రూపొందింది. సంగీతానికి ఎంతో ప్రాధాన్యముంటుంది. అందుకే ఈ చిత్రం అవకాశం ఇచ్చేటప్పుడు శేఖర్‌ కమ్ముల ఒకటే చెప్పారు.. ‘పాటలు సందర్భాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. అంతకంటే ఇంకేం వద్ద’న్నారు. పాట సందర్భం.. దాని నేపథ్యం.. అది ఎలా సాగాలి.. ఇలా ప్రతి విషయంలో శేఖర్‌ సర్‌కు ఓ స్పష్టత ఉంటుంది. దాన్ని నాకెంతో చక్కగా వివరించి పాటలు చేయించుకునేవారు. ముఖ్యంగా ‘సారంగ దరియా’ పాట కోసం అందరం చాలా కష్టపడ్డాం. ఈ చిత్రంలో పాటలు ఇన్ని మిలియన్‌ వ్యూస్‌ తెచ్చుకోవడం కొత్త సంగీత దర్శకుడిగా నాకెంతో సంతృప్తినిచ్చింది’’. దీ ‘‘మాది చిత్ర పరిశ్రమకు చెందిన కుటుంబమే. మా నాన్న విజయ్‌తో పాటు మా తాతగారు సి.నాగేశ్వరరావు సినిమాటోగ్రాఫర్స్‌గా పనిచేశారు. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇష్టం ఉండేది కానీ, నాన్న తాతయ్యల బాటలో సినిమాటోగ్రాఫర్‌ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. అయితే చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉండేది. ఆ ఇష్టంతోనే చెన్నైలోని ఓ మ్యూజిక్‌ అకాడమీలో సంగీతం నేర్చుకున్నా. ఆ సమయంలోనే నేను ట్యూన్‌ చేసిన మూడు పాటల్ని.. ఓ సంగీత విభావరిలో ఏఆర్‌ రెహమాన్‌ విన్నారు. ఆ కంపోజిషన్‌ ఆయనకు నచ్చడంతో నన్ను తన దగ్గర సహాయకుడిగా పెట్టుకున్నారు. అలా రెహమాన్‌ సర్‌తో ‘శివాజీ’, ‘రోబో’, ‘సర్కార్‌’ తదితర చిత్రాలకు పని చేశా. ఇప్పటి వరకు కొత్తగా నేను మరో చిత్రమేది ఒప్పుకోలేదు’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని