Pawankalyan: పవన్‌ని టార్గెట్‌ చేయాల్సిన అవసరం మాకు లేదు: కొడాలి నాని

‘‘పవన్‌ కల్యాణ్‌ చిత్రం హిట్టయినా.. ప్లాపైనా మాకు ఏమైనా లాభమా? ఆయన్ని టార్గెట్‌ చేయాల్సిన అవసరం జగన్మోహన్‌ రెడ్డికి లేద’’న్నారు మంత్రి కొడాలి నాని.

Updated : 30 Sep 2022 14:31 IST

‘‘పవన్‌ కల్యాణ్‌ చిత్రం హిట్టయినా.. ప్లాపైనా మాకు ఏమైనా లాభమా? ఆయన్ని టార్గెట్‌ చేయాల్సిన అవసరం జగన్మోహన్‌ రెడ్డికి లేద’’న్నారు మంత్రి కొడాలి నాని. ఒక సినిమాను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోదని, మొత్తం పరిశ్రమను దృష్టిలో పెట్టుకొనే ఏ నిర్ణయమైనా తీసుకుంటామన్నారు. ఆదివారం ‘ఆటో రజిని’ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. వేడుక అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘వేల మందికి జీవనోపాధి కల్పించేది సినీ పరిశ్రమ. అంతేకానీ, నలుగురు హీరోలు.. నలుగురు దర్శక, నిర్మాతలకు సంబంధించినది కాదు. సినిమానే లోకంగా బతికే ప్రతి డిస్టిబ్యూటర్‌కి, నిర్మాతకు న్యాయం జరగాలి. అదే విధంగా ప్రజలకూ అన్యాయం జరగకూడదు. అందరూ బతకాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. అందుకే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, న్యాయం జరిగేలా ఏపీ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది. అందరినీ దృష్టిలో పెట్టుకొని సినీ నిర్మాతలతో మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయి. నిర్మాతలు మా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. వాటిని మేమెంత వరకు చేయగలమో చూసుకుని మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. వాటిపై చర్చించి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా సామరస్యమైన వాతావరణంలో సమస్యను పరిష్కరిస్తాం’’ అన్నారు కొడాలి నాని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని