ప్రకాశ్‌ రాజ్‌ జట్టులో హేమ.. జీవిత

తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల వేడి మొదలైంది. అక్టోబరు 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు చిత్రసీమ పెద్దలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈసారి ‘మా’ అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలుస్తున్న నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తన ప్యానెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ‘‘సిని‘మా’బిడ్డలం’’ పేరుతో హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు....

Updated : 04 Sep 2021 07:22 IST

తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల వేడి మొదలైంది. అక్టోబరు 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు చిత్రసీమ పెద్దలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈసారి ‘మా’ అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలుస్తున్న నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తన ప్యానెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ‘‘సిని‘మా’బిడ్డలం’’ పేరుతో హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేయాలనుంది. మాకు అవకాశం ఇస్తే అది చేసి చూపిస్తాం. గతంలో కొందరు సభ్యులతో విలేకర్ల ముందుకొచ్చా. వారు ప్యానల్‌ సభ్యులు కాదు. నా శ్రేయోభిలాషులు మాత్రమే. ఇప్పుడు ‘మా’ ప్యానెల్‌ను ప్రకటిస్తున్నా. ఇందులో మహిళలకు సమాన అవకాశం కల్పిస్తున్నాం. అందరూ హేమ, జీవితా రాజశేఖర్‌ అధ్యక్షులుగా పోటీ చేస్తారని భావించారు. ఈ విషయమై నేను హేమతో మాట్లాడా. ‘మనందరం కలిసి ఉండాలి మీరేమంటారు’ అని అడిగాం. ‘నేను ప్రెసిడెంట్‌గా పోటీ చేయను. మీ ఆలోచనలు నాకు నచ్చాయి. మీ ప్యానెల్‌లో పోటీ చేయడానికి నాకు అభ్యంతరం లేద’ని ఆమె చెప్పారు. ఇక జీవితా రాజ శేఖర్‌తో రెండు గంటలకు పైగా మాట్లాడా. మా కార్యాచరణను ఆమె ముందుంచాను. ఆ విషయాలన్నీ ఆమెకి నచ్చాయి. దీంతో నా ప్యానెల్‌లో పోటీ చేయడానికి ఒప్పుకొన్నారు. రాజశేఖర్‌ ఇందుకు మద్దతిస్తానని అన్నారు’’ అని వివరించారు. ప్రకాశ్‌ రాజ్‌ ఈ సందర్భంగా మంచు విష్ణుతో పాటు డ్రగ్స్‌ కేసు విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికలనేవి ప్రజాస్వామ్యం. అవి వచ్చినప్పుడు మంచి.. చెడు మీద చర్చ జరుగుతుంది. దాని వల్ల పని చేసే వాళ్లకు అవకాశం వస్తుంది. విష్ణు గారు ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు ‘మా’ భవనం అంటున్నారు. దాని కన్నా చాలా సమస్యలున్నాయి. ‘మా’ భవనం కావాలని అందరు సభ్యులు అనుకుంటే విష్ణునే ఎన్నుకుంటార’’న్నారు. అనంతరం డ్రగ్స్‌ కేసు విచారణ విషయమై మాట్లాడుతూ ‘‘డ్రగ్స్‌ అనేది చాలా తప్పు. విచారణ జరుగుతోంది. నిరూపణ అయితే చర్యలు తీసుకోవాల్సిందే’’ అన్నారు.

అధ్యక్షుడు: ప్రకాశ్‌ రాజ్‌
కార్యదర్శి: జీవితా రాజశేఖర్‌
ఉపాధ్యక్షుడు: బెనర్జీ
ఉపాధ్యక్షురాలు: హేమ
ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌: శ్రీకాంత్‌
సంయుక్త కార్యదర్శి: అనితా చౌదరి
సంయుక్త కార్యదర్శి: ఉత్తేజ్‌
కోశాధికారి: నాగినీడు

కార్యవర్గ సభ్యులు..

అనసూయ, అజయ్‌, బి.భూపాల్‌, బ్రహ్మాజీ, ప్రభాకర్‌, గోవిందరావు, ఖయ్యూం, కౌశిక్‌, ప్రగతి, రమణారెడ్డి, శివారెడ్డి, సమీర్‌, సుడిగాలి సుధీర్‌, డి.సుబ్బరాజు, సురేశ్‌ కొండేటి, తనీష్‌, టార్జాన్‌. సాయికుమార్‌, బండ్ల గణేశ్‌లను అధికార ప్రతినిధులుగా వ్యవహరించనున్నట్లు ప్రకాశ్‌రాజ్‌ తెలియజేశారు. త్వరలో తన ప్యానెల్‌ సభ్యులందరితో కలిసి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తమ ఎజెండాను అప్పుడే వివరిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని