RRR: మేకింగ్‌ మామూలుగా లేదు..

తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచదేశాలకు విస్తరించిన దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌ రౌద్రం రణం రుధిరం’. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రధారులుగా....

Updated : 15 Jul 2021 11:38 IST

అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు

హైదరాబాద్‌: తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచదేశాలకు విస్తరించిన దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌ రౌద్రం రణం రుధిరం’. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మేకింగ్‌ వీడియోని గురువారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ‘రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరుతో బయటకు వచ్చిన ఈ వీడియో ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. చరణ్‌, తారక్‌లకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణను ఇందులో చూపించారు. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ని సైతం ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు అలా.. రుచి చూపించారు. ఈ ఏడాది అక్టోబరు 13న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం నేడు అధికారికంగా ప్రకటించింది. 

దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, తారక్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. చరణ్‌కి జోడీగా సీత పాత్రలో బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌ సందడి చేయనున్నారు. అలాగే తారక్‌ ప్రేయసిగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ నటిస్తున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలోని ఆయా పాత్రల్ని పరిచయం చేస్తూ విడుదలైన ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’, ‘రామరాజు ఫర్‌ భీమ్‌’, ‘అజయ్‌ దేవ్‌గణ్‌ బర్త్‌డే స్పెషల్‌ వీడియో’, ఆలియాభట్‌, ఒలీవియా, తారక్‌-చెర్రీ పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకుల్ని ఫిదా చేసేశాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన మేకింగ్‌ వీడియో సినీ ప్రియుల్లో అంచనాలు పెంచుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని