మహేష్‌ చెప్పిన ఆ సినిమా ఇదే అవుతుంది

‘‘గోదావరి జిల్లాల నేపథ్యంలో వస్తున్న చిత్రమిది. గోదావరి భాషలోనే చెప్పాలంటే ఇదొక మంచి పులసలాంటి సినిమా’’ అన్నారు సుధీర్‌బాబు.

Updated : 23 Aug 2021 07:00 IST

‘‘గోదావరి జిల్లాల నేపథ్యంలో వస్తున్న చిత్రమిది. గోదావరి భాషలోనే చెప్పాలంటే ఇదొక మంచి పులసలాంటి సినిమా’’ అన్నారు సుధీర్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ఆనంది కథానాయిక. కరుణకుమార్‌ దర్శకత్వం వహించారు. 70 ఎమ్‌.ఎమ్‌. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి   నిర్మిస్తున్నారు. ఈ నెల 27న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. తొలి బిగ్‌ టికెట్‌ని సుధీర్‌బాబు తల్లిదండ్రులు విడుదల చేయగా, దర్శకుడు అనిల్‌ రావిపూడి, కథానాయకుడు కార్తికేయ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘సుధీర్‌బాబు 12 సినిమాలు చేసిన కథానాయకుడైనా నేను చెప్పిన కథ నచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చారు. నిర్మాతలు అగ్రశేణి సాంకేతిక బృందాన్ని సమకూర్చి ఈ సినిమా ఇంత అందంగా రావడానికి కారణమయ్యారు. నా స్నేహితుడు నాగేంద్ర కాశి ఇంత మంచి కథని నాకు అందించాడు’’ అన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘‘నేను రొటీన్‌ సినిమాలు చేయను. విభిన్నమైన కథల్నే ఎంపిక చేసుకుంటా. ఈ మాట ఎందుకన్నానో ఈ నెల 27న సినిమా చూశాక అర్థమవుతుంది. చిరంజీవి తొలి పాటని విడుదల చేశారు. ప్రభాస్‌, మహేష్‌ టీజర్‌, ట్రైలర్‌ని విడుదల చేసి  అభినందించారు. మహేష్‌ ఓ వేడుకలో మాట్లాడుతూ ‘సుధీర్‌కి సరైన సినిమా పడితే తర్వాత స్థాయికి వెళతాడు’ అన్నారు. ఆయన చెప్పిన  ఆ సరైన సినిమా ఇదే అవుతుంది. ‘పలాస’ని మించిపోయేలా ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ని తీర్చిదిద్దాడు కరుణకుమార్‌. నిర్మాతలు నా పక్కనుంటే మా మావయ్య కృష్ణ, మహేష్‌బాబు నా పక్కనున్నంత ధైర్యం వస్తుంది’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మేం ‘పలాస’ చూసిన వెంటనే ఆ చిత్ర దర్శకుడితో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. మేం మొదలు పెట్టిన దగ్గర్నుంచి మాకు చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా వెనకడుగు వేయకుండా చిత్రాన్ని పూర్తి చేశాం. ట్రైలర్‌ విడుదల చేయగానే తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ వ్యాపారం పూర్తయింది. దీనికంతా కారణం మా అత్యుత్తమ సాంకేతిక బృందమే’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆది శేషగిరిరావు, తమ్మారెడ్డి భరద్వాజ, మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, అజయ్‌ భూపతి, బుచ్చిబాబు, శ్రీరామ్‌ ఆదిత్య, హర్షవర్ధన్‌, సుధీర్‌, రమణ తేజ, రాజ్‌ కందుకూరి, విష్ణు, సంగీత దర్శకుడు మణిశర్మ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని