ఎన్నికల తేదీపై వారంలో నిర్ణయం

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల తేదీ ఎప్పుడనే విషయాన్ని వారం రోజుల్లో నిర్ణయిస్తామని ‘మా’ క్రమశిక్షణ కమిటీ సంఘం నాయకులు,...

Updated : 23 Aug 2021 07:19 IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల తేదీ ఎప్పుడనే విషయాన్ని వారం రోజుల్లో నిర్ణయిస్తామని ‘మా’ క్రమశిక్షణ కమిటీ సంఘం నాయకులు, ప్రముఖ నటులు కృష్ణంరాజు, మురళీమోహన్‌ తెలిపినట్టు సమాచారం.  ఆదివారం ‘మా’ సర్వసభ్య సమావేశం ఆన్‌లైన్‌ వేదికగా జరిగింది. సినీ పరిశ్రమకి చెందిన పలువురు నటులు ఇందులో పాల్గొన్నారు. మా కార్యవర్గ ఎన్నికల నిర్వహణ అంశం ప్రధానంగా చర్చకి వచ్చినట్టు తెలిసింది. సభ్యులు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేయగా,  క్రమశిక్షణ కమిటీ ఎలా చెబితే అలా చేస్తామని ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ తెలిపారని  తెలిసింది. ‘‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలి. ‘మా’ నిబంధనల ప్రకారం 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలంటే సెప్టెంబరు 12వ తేదీ అవుతుంది. అవసరమైతే మరో వారం సమయం తీసుకోవాలని, అంతకుమంచి పొడిగించాల్సిన అవసరం లేద’’ని ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేయనున్న ప్రకాష్‌రాజ్‌ సూచించినట్టు తెలుస్తోంది. ‘‘ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని, నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి. సెప్టెంబరు రెండో వారం నుంచి అక్టోబరు రెండో వారం మధ్యలో ఏ తేదీ అనువుగా ఉంటుందో చూస్తాం’’ని క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడినట్టు కొద్దిమంది నటులు తెలిపారు. ఈ సమావేశంలో ‘మా’ భవనం గురించి ప్రముఖ నటుడు మోహన్‌బాబు వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ‘‘మా కోసం ఒక భవనం కొన్నారు. దాన్ని మళ్లీ అమ్మేశారు. రూపాయికి కొని అర్ధ రూపాయికి అమ్మేస్తారా? దాని గురించి ఎవరైనా మాట్లాడారా? నన్ను కలిచి వేస్తున్నది విషయం అదే. అందరూ కలిసి సముచిత నిర్ణయం తీసుకోవాల’’ని మోహన్‌బాబు సూచించారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని