OTT: ఈ వారంలో రాబోతున్న చిత్రాలివే!

OTT Movies: ఈ వారం కూడా పలు చిత్రాలు ఓటీటీ వేదిక ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి చిత్రాలేంటో చూసేయండి.

Updated : 19 Jul 2021 09:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కేసులు తగ్గినా, పరిస్థితులు ఇంకా పూర్తిగా కుదటపడని నేపథ్యంలో పలు చిత్రాలు ఓటీటీ బాటపడుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లు తెరిచినా ఏ మేరకు ప్రేక్షకులు వస్తారన్నది ప్రశ్నార్థకమే. దీంతో దర్శక-నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. గతవారంలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి చిత్రాలేంటో చూసేయండి.

వెంకటేశ్‌ ‘నారప్ప’

అగ్ర కథానాయకుడు వెంకటేశ్ కీలక పాత్రలో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రాజీవ్‌ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా జులై 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ సూపర్​హిట్ ‘అసురన్’ రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు.


ఆర్య ‘సార్‌పట్ట’

ఇప్పటివరకూ క్రీడా నేపథ్యంతో చాలా చిత్రాలు వచ్చాయి. అయితే, పీరియాడికల్‌ డ్రామాకు బాక్సింగ్‌ను జోడించి పా.రంజిత్‌ తెరకెక్కించిన చిత్రం ‘సార్‌పట్ట’. ఆర్య కీలక పాత్రలో నటించారు. వేసవిలో థియేటర్‌లలో సందడి చేయాల్సిన ఈ సినిమా కరోనా దెబ్బకు ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. ఈనెల 22న అమెజాన్ ప్రైమ్​లో తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.


ఇక్కత్(కన్నడ)

విడాకులు తీసుకోవాలనుకున్న ఓ జంట.. కరోనా లాక్‌డౌన్​ కారణంగా ఒకే ఇంట్లో రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది? చివరకు ఏమైంది? అనే కథే ‘ఇక్కత్’. కామెడీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం.. అమెజాన్ ప్రైమ్​లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈషం ఖాన్‌, హసీన్‌ ఖాన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు.


14 ఫెరే (హిందీ)

విక్రాంత్ మస్సే, కృతి కర్బందా జంటగా, దేవాన్షు సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సోషల్‌ కామెడీ డ్రామా మూవీ ‘14 ఫెరే’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 23న జీ5 వేదికగా విడుదల కానుంది. పెళ్లికి సిద్ధమైన ఓ ప్రేమజంట.. ఇంట్లో వాళ్లను నొప్పించకుండా ఒకటి కావాలనుకుంటారు. ఈ క్రమంలో అద్దెకు తెచ్చిన తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనే కథతో తీసిన సినిమా ‘14 ఫెరే’.


హంగామా 2 (హిందీ)

2003లో బాలీవుడ్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘హంగామా’. దానికి కొనసాగింపుగా.. మలయాళ సూపర్‌హిట్‌ ‘మిన్నారం’ రీమేక్‌గా వస్తున్న చిత్రం ‘హంగామా2’. శిల్పాశెట్టి, మిజాన్‌ జెఫ్రీ, పరేశ్‌ రావల్‌, ప్రణీత తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రియదర్శన్‌ తెరకెక్కించారు. రెండు కుటుంబాల మధ్య జరిగే హాస్యభరిత సంఘటనల కథే ఈ సినిమా. జులై 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్​స్టార్ ​వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది.


‘హీరో’గా రానున్న రిషభ్‌ శెట్టి

రిషభ్‌శెట్టి కీలక పాత్రలో భరత్‌రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘హీరో’. ఈ ఏడాది మార్చిలో కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో ‘హీరో’ పేరుతోనే అలరించేందుకు సిద్ధమైంది. ‘బెల్‌బాటమ్‌’ చిత్రంతో తెలుగువారికి సుపరిచితుడైన నటుడు రిషభ్‌శెట్టి ఇందులో నటించారు. బ్లాక్‌ కామెడీ నేపథ్యంతో రూపొందించిన ఈ సినిమా జులై 24న ‘ఆహా’లో విడుదల కానుంది.


అలరించనున్న మరికొన్ని చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు

* ‘ద లాస్ట్ లెటర్ ఫ్రమ్ యువర్ లవర్’ (జులై 23- నెట్‌ఫ్లిక్స్)

* ఫీల్స్ లైక్ ఇష్క్ (జులై 23- నెట్‌ఫ్లిక్స్)

* స్కై రోజో సీజన్ 2 (జులై 23- నెట్‌ఫ్లిక్స్)

* టెడ్ లాసో సీజన్ 2 (జులై 23- యాపిల్ టీవీ ప్లస్)

* మర్డర్ ఇన్ హిల్స్ (బెంగాలీ సిరీస్ జులై 23- హోయ్​చోయ్)

* హాస్టల్ డేజ్‌ సీజన్ 2 (జులై 23- అమెజాన్ ప్రైమ్)

* కింగ్​డమ్: అసిన్ ఆఫ్ నార్త్ (జులై 24- నెట్​ఫ్లిక్స్)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని