విద్యార్థిని హత్య: నిర్మాతలపై కంగన ఆగ్రహం

బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ పాపులర్‌ వెబ్‌ సిరీస్‌ ‘మీర్జాపూర్‌’ నిర్మాతల్ని విమర్శించారు. తమ సిరీస్‌ ద్వారా నేరస్థుల్ని ప్రోత్సహిస్తున్నారని తప్పుపట్టారు. హరియాణాలోని బల్లాబ్‌గఢ్‌లో డిగ్రీ విద్యార్థిని పట్టపగలు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. బీకాం ఫైనలియర్‌ పరీక్ష ....

Published : 31 Oct 2020 19:24 IST

దాని ఫలితమే ఇది..! 

ముంబయి: బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ పాపులర్‌ వెబ్‌ సిరీస్‌ ‘మీర్జాపూర్‌’ నిర్మాతల్ని విమర్శించారు. ఈ సిరీస్‌ ద్వారా నేరస్థుల్ని ప్రోత్సహిస్తున్నారని తప్పుపట్టారు. హరియాణాలోని బల్లాబ్‌గఢ్‌లో డిగ్రీ విద్యార్థిని పట్టపగలు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. బీకాం ఫైనలియర్‌ పరీక్ష రాసేందుకు తన స్నేహితురాలితో కలిసి వెళ్లిన యువతి కోసం నిందితుడు తౌసీఫ్‌, అతడి మిత్రుడు కాలేజీ బయట కారులో కాపు కాశారు. యువతి వారి దగ్గరికి రాగానే ఆమెను కారులో కూర్చోవాలని తౌసీఫ్‌ బలవంతం చేశాడు. తనతో పెళ్లికి అంగీకరించాలని అడిగాడు. విద్యార్థిని తిరస్కరించి, పరుగెత్తడంతో ఆమెను వెంటాడి.. కాల్చాడు.

కాగా ‘మీర్జాపూర్‌’లోని మున్నా త్రిపాఠి పాత్రను చూసిన తర్వాత బాధితురాలిని హత్య చేయాలని తౌసీఫ్‌ నిర్ణయించుకున్నాడని విచారణలో తెలిసినట్లు వార్తలు వస్తున్నాయి. వీటిని చూసిన కంగన ట్విటర్‌లో స్పందించారు. విలన్లను యాంటీ-హీరోలుగా (ఆదర్శవాదం, నైతిక విలువలు లేని హీరో) చూపిస్తున్నారని, నేరస్థులను గొప్పగా చూపిస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయని కంగన అన్నారు. ‘చూసేందుకు చక్కగా ఉన్న ఓ యువకుడు నెగటివ్‌, చెడు పాత్రల్ని పోషిస్తే, అతడ్ని విలన్‌గా కాకుండా యాంటీ-హీరోగా తెరపై చూపిస్తే వచ్చే ఫలితం ఇది. ఎప్పుడూ మంచి కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్న బాలీవుడ్‌ సిగ్గుపడాలి’ అని ఆమె పోస్ట్‌ చేశారు. ఫర్హాన్‌ అక్తర్‌, రితేష్‌ సిద్వాణీ సంయుక్తంగా ‘మీర్జాపూర్‌’ను నిర్మించారు. ఇటీవల రెండో సీజన్‌ ఆరంభమైంది. మొదటి సీజన్‌లో స్వీటీ తన ప్రేమను తిరస్కరించి, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని పంకజ్‌ త్రిపాఠి ఆమెను హత్య చేస్తాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని